ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ
గూడూరు, ప్రజా వీక్షణం:
న్యాక్ మూల్యాంకనంలో మెరుగైన గ్రేడ్ సాధించేందుకు అధ్యాపకులు సమన్వయంతో కృషి చేయాలని ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రాంప్రసాద్ పిలుపునిచ్చారు. గూడూరులోని కళాశాలలో న్యాక్ ప్రీ-అవేర్నెస్ కార్యక్రమం-2026లో భాగంగా అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కళాశాలలో సరస్వతీ పూజ అనంతరం నిర్వహించిన ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సి.హెచ్. మస్తానయ్య ముఖ్య వక్తగా హాజరై న్యాక్ మూల్యాంకన ప్రమాణాలపై అవగాహన కల్పించారు. కళాశాల రికార్డుల నిర్వహణ, విద్యార్థుల భాగస్వామ్యంతో సామాజిక కార్యక్రమాల నిర్వహణ, నైపుణ్యాభివృద్ధి, సెమినార్లు, చర్చాగోష్ఠులు తదితర అంశాలపై అధ్యాపకులకు వివరించారు.న్యాక్ మూల్యాంకన బృందాలతో కళాశాలలను సందర్శించిన తన అనుభవాలను పంచుకుంటూ, నాణ్యమైన విద్యాబోధనతో పాటు విద్యా, విస్తరణ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కళాశాల అభివృద్ధికి అవసరమైన అన్ని అంశాల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని పేర్కొన్నారు.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రాంప్రసాద్ మాట్లాడుతూ, ఈసారి న్యాక్ మూల్యాంకనంలో కళాశాలకు మెరుగైన గ్రేడ్ సాధించేందుకు ప్రతి అధ్యాపకుడు అంకితభావంతో పనిచేయాలని కోరారు. రికార్డుల నిర్వహణ నుంచి విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి వరకు ప్రతి అంశంలోనూ సమష్టి కృషి అవసరమని తెలిపారు.అనంతరం ముఖ్య వక్త డాక్టర్ సి.హెచ్. మస్తానయ్యను కళాశాల తరఫున ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎస్. కిరణ్మయి, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ యశోద, డాక్టర్ గోవిందు సురేంద్ర, డాక్టర్ కె. లావణ్య, డాక్టర్ ఏ.వి. ప్రసాద్, వి.వి. రమణారెడ్డి, వాసంతి, డాక్టర్ మహేష్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.












