హామీలన్నీ నెరవేరుస్తాం: చంద్రబాబు

  • రైతుల భూమికి భద్రత.. రాష్ట్రానికి అభివృద్ధి బాట
  • భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం
  • మూడేళ్లలో రూ.36 వేల కోట్లతో 35 ప్రాజెక్టులు
  • పనితీరు మార్చుకోకపోతే అధికారులపై చర్యలు తప్పవు

నర్సింగోలు, అక్టోబర్ 9 (ప్రజా వీక్షణం ప్రతినిధి): రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లలా భావిస్తూ పాలన సాగిస్తామని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం నర్సింగోలులో శుక్రవారం పర్యటించిన ఆయన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా రైతులకు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ, రైతులు తమ పొలాల్లో పంటల సాగు, దిగుబడుల పెంపుపై దృష్టి పెట్టాలి తప్ప భూమి భద్రత గురించి ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఉండకూడదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో భూ రికార్డులకు సంబంధించి చోటుచేసుకున్న అవకతవకలను సరిదిద్దుతూ రైతులకు భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. పాత పట్టాదారు పాస్‌పుస్తకాలపై ఉన్న రాజకీయ నాయకుల చిత్రాలను తొలగించి, ప్రభుత్వ రాజముద్రతో కొత్త పుస్తకాలను అందిస్తున్నామని వివరించారు. వివాదాస్పద భూ హక్కుల చట్టాన్ని రద్దు చేశామని, రైతులను ఇబ్బందులకు గురిచేసిన 22ఏ నిషేధిత జాబితా సమస్యలకు పరిష్కారం చూపుతున్నామని పేర్కొన్నారు. భూమి రైతుదేనని, ఆ హక్కును కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని పునరుద్ఘాటించారు.
రాష్ట్రవ్యాప్తంగా 16.48 లక్షల ఎకరాలను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించామని చంద్రబాబు వెల్లడించారు. ప్రకాశం జిల్లాలో 3,304 ఎకరాలకు సంబంధించిన భూ సమస్యలను పరిష్కరించి 7,980 కుటుంబాలకు ఊరట కల్పించామని తెలిపారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని భూ వివాదాలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ రైతులకు హక్కులు కల్పిస్తున్నామని చెప్పారు. భూ రికార్డులను డిజిటలీకరించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భద్రపరిచామని, రైతులు తమ ఇంటి నుంచే ఫోన్‌ ద్వారా భూమి వివరాలను తెలుసుకునే సౌకర్యం కల్పిస్తున్నామని వివరించారు. ప్రతి నెలా తొమ్మిదో తేదీన ఈ కార్యక్రమ పురోగతిని తానే స్వయంగా సమీక్షిస్తానని, భూ రికార్డుల వ్యవహారంలో అవినీతికి తావులేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు, జిల్లాలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోతుల చెంచయ్య పాలేరు జలాశయం నిర్మాణానికి, పాలేరు నదిపై ఎత్తైన వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ పనులు పూర్తయితే 9,500 ఎకరాలకు సాగునీరు, 15 గ్రామాల్లోని 30 వేల మందికి తాగునీరు అందుతుందని తెలిపారు.
వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ద్వారా నీటిని విడుదల చేసిన అనంతరమే దాన్ని జాతికి అంకితం చేశామని, రెండో దశను కూడా పూర్తి చేసి ప్రతి ఏటా నీటిని అందించే బాధ్యత తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించారు. రాబోయే మూడేళ్లలో రూ.36 వేల కోట్ల వ్యయంతో 35 ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. రామాయపట్నం నౌకాశ్రయ నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామని, బీపీసీఎల్‌ సంస్థ రూ.50 వేల కోట్ల పెట్టుబడితో ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి ఊతమివ్వనుందని చెప్పారు. దోనకొండను కీలక పారిశ్రామిక పట్టణంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అభివృద్ధి పనులతో పాటు ప్రభుత్వ శాఖల పనితీరుపైనా సభావేదిక నుంచే సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల అధికారులను వేదికపైకి పిలిపించి ప్రజల నుంచి వచ్చిన స్పందన ఆధారంగా రూపొందించిన పనితీరు వివరాలను వెల్లడించారు. రాష్ట్ర సగటుతో పోలిస్తే ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం వెనుకబడిన అంశాలను గణాంకాలతో సహా వివరించారు. తాగునీటి సరఫరా, రవాణా శాఖ పన్నుల వసూళ్లు, భూముల పునఃసర్వే, అంగన్‌వాడీ సేవలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు వంటి అంశాల్లో ప్రతికూల పనితీరుపై అధికారులను ప్రశ్నించారు.
ప్రజలకు అందాల్సిన సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని చంద్రబాబు అధికారులను హెచ్చరించారు. అధికారులు సక్రమంగా పనిచేయకపోతే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుందని, అలాంటి పరిస్థితికి కారణమయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అదే సమయంలో గృహ నిర్మాణం, ఇసుక సరఫరా, మత్స్యకార భరోసా వంటి అంశాల్లో మెరుగైన ఫలితాలు సాధించిన అధికారులను అభినందించారు. ప్రజలకు సకాలంలో సేవలు అందించడం, సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ యంత్రాంగం ప్రాథమిక బాధ్యతగా భావించాలని సూచించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణపైనా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని చెప్పారు. ఆరోగ్యమే అసలైన సంపద అని, ఆహారపు అలవాట్ల విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నాలుకకు నచ్చినదే కాకుండా శరీరానికి మేలు చేసే ఆహారాన్ని ఎంచుకోవాలని, వంటగదిలోనే ఆరోగ్యానికి అవసరమైన అనేక పరిష్కారాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య వివరాలను డిజిటలీకరించి, సరైన సమయంలో మందులు వేసుకునేలా గుర్తుచేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. వ్యక్తిగత ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడంతో పాటు వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. పెన్షన్ల పెంపు, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏటా మూడు ఉచిత వంటగ్యాస్‌ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ వంటి పథకాల ద్వారా ప్రజలకు ప్రయోజనం కల్పిస్తున్నామని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి, కేంద్రం–రాష్ట్రం–స్థానిక సంస్థల సమన్వయంతో అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. వెనుకబడిన తరగతుల రాజకీయ ప్రాతినిధ్యంపై మాట్లాడుతూ, రిజర్వేషన్లను 34 శాతానికి పెంచే ప్రయత్నాన్ని ప్రత్యర్థులు న్యాయస్థానాల ద్వారా అడ్డుకున్నారని ఆరోపించారు. న్యాయస్థానాల తీర్పులకు లోబడి, పార్టీ తరఫున వెనుకబడిన తరగతులకు 34 శాతానికి మించి సీట్లు కేటాయించేందుకు కృషి చేస్తామని తెలిపారు. నీతివంతమైన పాలన అందించడమే తన లక్ష్యమని, తాను ఒక్కరే నిజాయతీగా ఉంటే సరిపోదని, తనతో పాటు పనిచేసే అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా అవినీతికి దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిని ఉపేక్షించబోమని, పాలనా వ్యవస్థలో ప్రతి ఒక్కరి పనితీరును నిశితంగా పరిశీలిస్తున్నామని హెచ్చరించారు. పిల్లలకు చిన్నతనం నుంచే దేశభక్తి, సమాజంపై బాధ్యత, రాష్ట్రాభివృద్ధిపై అవగాహన కల్పించాలని కోరారు. ఆర్థిక అసమానతలు తగ్గి, ప్రతి కుటుంబానికి అభివృద్ధి ఫలాలు అందే సమాజాన్ని నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు పునరుద్ఘాటించారు.

error: Content is protected !!
Prajaveek Shanam