
గూడూరు: ప్రజా వీక్షణం అక్టోబర్ 12
గూడూరు పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎం) పథకం కింద పట్టణ పరిధిలో నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.30 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని గూడూరు ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని రహదారులను అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గూడూరు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఎమ్మెల్యే వివరించారు. రూ.75 లక్షలతో పట్టణంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశామని, రూ.1.27 కోట్లతో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మించామని తెలిపారు. అలాగే రూ.కోటి వ్యయంతో మార్కెట్ నిర్మాణాన్ని పూర్తి చేసి వ్యాపారులకు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో రూ.84 లక్షలతో డ్రైనేజీల పూడికతీత పనులు చేపట్టినట్లు వెల్లడించారు.అమృత్ 2.0, స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్బీఎం) 2.0 పథకాల నిధులతో తాగునీటి సరఫరా, డ్రైనేజీల అభివృద్ధి, పైప్లైన్ మరమ్మతులు, జీఆర్పీ పైప్లైన్ల మార్పు, చెరువుల అభివృద్ధి తదితర పనులు కలిపి సుమారు రూ.194.32 కోట్లతో కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు.గత ప్రభుత్వ హయాంలో గూడూరు మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి పనులను, ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలు బేరీజు వేసుకోవాలని డాక్టర్ పాశిం సునీల్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో గతంలో ఉన్న పరిస్థితులకు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి ప్రజలు తమ నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.












