చివరి టీ20లో భారత్‌ కీలక మార్పులు!

ముంబై, అక్టోబరు 31 (ప్రజా వీక్షణంప్రతినిధి): న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను విజయంతో ముగించడమే లక్ష్యంగా టీమిండియా చివరి పోరుకు సిద్ధమవుతోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 3-1తో ఆధిక్యంలో ఉన్న భారత్‌.. ఆక్లాండ్‌లో ఎదురైన 87 పరుగుల భారీ ఓటమితో అప్రమత్తమైంది. దీంతో నవంబరు 1న హామిల్టన్‌లో జరిగే ఐదో టీ20లో తుది జట్టులో మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యువ ఆటగాడు వైభవ్‌ సూర్యవంశీకి అవకాశం దక్కుతుందా? సంజూ శాంసన్‌ జట్టులో కొనసాగుతాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.
వైభవ్‌కు అవకాశం.. సంజూ స్థానంపై ఉత్కంఠ
సిరీస్‌ తొలి మ్యాచ్‌లో 67 పరుగులు చేసిన సంజూ శాంసన్‌.. ఆ తర్వాత వరుసగా 14, 18, 4 పరుగులే చేశాడు. దీంతో అతడి స్థానంలో వైభవ్‌ సూర్యవంశీని ఆడించే అవకాశాలున్నాయని క్రికెట్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ కూడా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. వెస్టిండీస్‌తో లక్నోలో తొలి టీ20 శతకం సాధించిన తర్వాత గత ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 40, 1, 16, 22, 42, 7, 5, 22 పరుగులే చేశాడు. చివరి మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్‌తో తన ఫామ్‌ను తిరిగి అందుకోవాలని భావిస్తున్నాడు.
కుల్దీప్‌, వరుణ్‌లకు చోటు దక్కేనా?
నమన్‌ ధీర్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌తో ఉపయోగపడుతున్నప్పటికీ.. బౌలింగ్‌లో మాత్రం ఆశించిన ప్రభావం చూపలేకపోతున్నారు. మరోవైపు పరిస్థితులను బట్టి కుల్దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తిలలో ఒకరికి తుది జట్టులో అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌ సాయిరాజ్‌ బహుతులే సంకేతాలిచ్చాడు. అయితే, వీరిలో ఒకరిని తీసుకుంటే నమన్‌ ధీర్‌ను తప్పించాల్సి రావచ్చు. అలా చేస్తే జట్టు బ్యాటింగ్‌ బలం తగ్గడంతో పాటు అతడి పార్ట్‌టైమ్‌ ఆఫ్‌స్పిన్‌ సేవలు కూడా అందుబాటులో ఉండవు.
ఫిలిప్స్‌ ఫామ్‌పై కివీస్‌ ఆశలు
మరోవైపు న్యూజిలాండ్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ ఫామ్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. ఆక్లాండ్‌లో అద్భుత శతకం సాధించిన అతడు.. ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో 276 పరుగులు చేశాడు. ఐదు మ్యాచ్‌ల ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ల్లో న్యూజిలాండ్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మార్క్‌ చాప్‌మన్‌ (290) తర్వాతి స్థానంలో నిలిచాడు. ఆక్లాండ్‌ మ్యాచ్‌లో అర్ధశతకం సాధించిన మైకేల్‌ బ్రేస్‌వెల్‌ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు.
స్పిన్నర్ల పోరు కీలకం
ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల స్పిన్నర్ల ప్రదర్శన కూడా కీలకం కానుంది. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మిచెల్‌ శాంట్నర్‌ సిరీస్‌లో నిలకడగా బౌలింగ్‌ చేస్తున్నాడు. శాంట్నర్‌ 55 శాతం బంతులను ఫుల్‌ లెంగ్త్‌లో వేయగా.. అక్షర్‌ పటేల్‌ 72 శాతం బంతులను షార్ట్‌ లెంగ్త్‌లో సంధించాడు. హామిల్టన్‌లోని సెడ్డన్‌ పార్క్‌ మైదానం చిన్నదిగా ఉండటంతో స్పిన్నర్లు అనుసరించే వ్యూహాలు మ్యాచ్‌ ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
నవంబరు 1న మధ్యాహ్నం 12.30 గంటలకు హామిల్టన్‌లో ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. టెలివిజన్‌లో సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం కాగా.. సోనీ లివ్‌ వేదికగా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు.

error: Content is protected !!
Prajaveek Shanam