మురసు తుఫాన్‌పై జిల్లా యంత్రాంగం అప్రమత్తం

గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం

నవంబర్ 2 సాయంత్రం నుంచి 3వ తేదీ మధ్యాహ్నం వరకు ప్రభావం

మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు.. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి

నెల్లూరు, నవంబర్ 1: ప్రజా వీక్షణం

మురసు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల సూచించారు. నవంబర్ 2వ తేదీ సాయంత్రం నుంచి అర్ధరాత్రి మధ్య కావలి–కందుకూరు ప్రాంతాల మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. తుఫాన్ ప్రభావంతో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని, నవంబర్ 3వ తేదీ మధ్యాహ్నం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.కావలి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ప్రత్యేక అప్రమత్తత పాటించాలని కలెక్టర్ సూచించారు. నెల్లూరు నగరం నుంచి గూడూరు వరకు తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా లోతట్టు, తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అవసరమైతే అధికారులు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని సూచించారు.భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. పూరిగుడిసెలు, పాత భవనాలు, మట్టి గోడల ఇళ్లలో నివసించే వారు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదని స్పష్టం చేశారు. పశువులు, మేకలు, గొర్రెల రక్షణకు పశుసంవర్ధక శాఖ అధికారులు, యజమానులు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ 24 గంటలూ అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, అత్యవసర సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు.
కలెక్టరేట్‌లో 24 గంటల కంట్రోల్ రూం తుఫాన్, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు నెల్లూరు కలెక్టరేట్‌లో 24 గంటల కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు తలెత్తినా, వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదురైనా వెంటనే కంట్రోల్ రూంకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కంట్రోల్ రూం నంబర్లు:
0861-2331261
7995576699
జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉందని, ప్రజలు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల కోరారు.

error: Content is protected !!
Prajaveek Shanam