తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలపై ప్రత్యేక దృష్టి – మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

నెల్లూరు, మార్చి 23: రాష్ట్రంలోని తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, శాశ్వత పరిష్కారానికి గట్టి చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం నెల్లూరు జిల్లా కలెక్టరేట్‌లోని ఎస్ ఆర్ శంకరన్ హాల్లో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎస్పీ అజితా వేజెండ్ల, శాసనమండలి సభ్యులు రాంగోపాల్ రెడ్డి, బీద రవిచంద్ర, శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, పాశం సునీల్ కుమార్, నెలవల విజయశ్రీ తదితరులతో కలిసి మంత్రి మత్స్యకారుల సమస్యలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తీర ప్రాంత మత్స్యకారులకు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల మత్స్యకారులతో దీర్ఘకాలంగా సమస్యలు ఉన్నాయని, వాటికి శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మన రాష్ట్ర మత్స్య సంపదను ఇతర రాష్ట్రాలకు చెందిన మత్స్యకారులు హై పవర్ బోట్లతో అక్రమంగా దోచుకుంటున్నారని, ఇటీవల బంధించిన నాలుగు బోట్లను గుర్తు తెలియని వ్యక్తులు విడుదల చేయించిన ఘటన స్థానిక మత్స్యకారులలో ఆందోళన కలిగించిందన్నారు. ఈ నేపథ్యంలో సముద్ర జలాలపై గస్తీ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టామని తెలిపారు. మెరైన్ పోలీస్, అటవీ, మత్స్య శాఖ, అగ్నిమాపక శాఖలకు చెందిన అధికారులు రెండు బోట్లతో 24 గంటలు గస్తీ నిర్వహిస్తారని, ఏప్రిల్ 14 వరకు ఈ విధానం కొనసాగుతుందన్నారు. ఏప్రిల్ 15 నుండి రెండు నెలలపాటు వేట నిషేధం అమల్లోకి రానుండగా, ఈలోపు మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్ర స్థాయి ప్రత్యేక బృందం మంగళవారం జిల్లాకు వచ్చి ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమావేశమై ఆచరణాత్మక నివేదిక రూపొందిస్తుందని తెలిపారు. జిల్లాలోని మత్స్యకారులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ సమస్య మూడు రాష్ట్రాలకు సంబంధించినదైనందున కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించి శాశ్వత పరిష్కారం సాధించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, నాయకులు గిరిధర్ రెడ్డి, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ శాంతి తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam