దేశంలో నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధం

దేశవ్యాప్తంగా పార్లమెంట్ మరియు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించేందుకు సిద్ధమైంది. 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకుని ఈ ప్రక్రియను అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇదే సమయంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే చట్టాన్ని కూడా ఇదే పునర్విభజన ఆధారంగా అమలు చేసేందుకు కేంద్రం యోచిస్తోంది. దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనాభా ఆధారంగా సీట్ల పెంపు చేపడితే జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే ఆందోళనలు వ్యక్తమవడంతో సమతుల్య దృక్పథంగా 2011 గణాంకాలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ పునర్విభజన అమలైతే దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 543 నుంచి సుమారు 816కి పెరిగే అవకాశం ఉంది. ఇందులో మహిళలకు 33 శాతం కోటా కింద సుమారు 273 సీట్లు కేటాయించబడనున్నాయి. ఈ మార్పులతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు గణనీయంగా మారనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ సీట్లు 25 నుంచి 37-38 వరకు, అసెంబ్లీ సీట్లు 175 నుంచి 262-263 వరకు పెరిగే అవకాశం ఉంది. తెలంగాణలో లోక్‌సభ సీట్లు 17 నుంచి 25-26 వరకు, అసెంబ్లీ సీట్లు 119 నుంచి 178-179 వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనలపై ఏకాభిప్రాయం సాధించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అవసరమైతే పార్లమెంట్ సమావేశాలను ఏప్రిల్ రెండో వారం వరకు పొడిగించి బిల్లులను ఆమోదింపజేయాలని కేంద్రం భావిస్తోంది. ఇదే అంశంపై అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించే అవకాశముంది.

error: Content is protected !!
Prajaveek Shanam