
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఇప్పుడు ఇరాన్‌తో వార్ విషయంలో ఎలా బయటకు రావాలో అర్థం కావడంలేదు. యుద్ధాన్ని ఇజ్రాయెల్, ఇరాన్ కు వదిలేసి తాను బయటకు పోవడానికి గౌరవమైన మార్గం కనిపించడం లేదు. ఇరాన్ వదిలేలా లేదు. ట్రంప్ ఇక మాదారి మాదే అని వెళ్లిపోతే.. పరారైనట్లుగా అవుతుంది. అది అగ్రరాజ్యానికి అవమానం. ఇరాన్ పై ఇంకా ధాటిగా దాడి చేస్తే ప్రపంచం మొత్తానికి ఇంధన సమస్య.. ఇంటర్నెట్ సమస్య వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ కు ఏం చేయాలో తెలియడం లేదు.
ట్రంప్ చెప్పిందేమిటి..చేస్తున్నదేమిటి?
అమెరికాను అనవసరపు విదేశీ యుద్ధాల నుంచి బయటకు తీసుకువస్తానని వాగ్దానం చేసిన ట్రంప్‌కు, ఇరాన్ రూపంలో ఒక పెద్ద సవాలు ఎదురైంది. ప్రారంభించిన వార్ నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య ఘర్షణను వదిలేసి అమెరికా తప్పుకుంటే, అది మిత్రదేశాలను వంచించినట్లు అవుతుందని, అగ్రరాజ్యం ప్రాభవం దెబ్బతింటుందని ఆయన భయం. ఈ వార్ విషయంలో ఎగ్జిట్ స్ట్రాటజీ దొరకకపోవడమే ట్రంప్‌ను డైలమాలో పడేసింది. యుద్ధాన్ని ఆపలేక, అలాగని అందులో పూర్తిగా దిగలేక అమెరికా ఒక అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోంది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై యుద్ధ నీడలు
ఇరాన్‌పై అమెరికా , ఇజ్రాయెల్ మరింత తీవ్రంగా విరుచుకుపడితే, అది కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాదు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం జరిగితే ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థ అతలాకుతలమవుతుంది. ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడమే కాకుండా, సముద్రాంతర కేబుళ్ల ద్వారా సాగే అంతర్జాతీయ ఇంటర్నెట్ వ్యవస్థకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారితీస్తాయని, అది తన దేశీయ రాజకీయ భవిష్యత్తును దెబ్బతీస్తుందని ట్రంప్ ఆందోళన చెందుతున్నారు.
పరస్పర అపనమ్మకమే శత్రువు
యుద్ధం ఆగాలంటే ఇరాన్ కొంత తగ్గాలని భావిస్తున్నా, అది అంత సులువు కాదు. ఇరాన్ ఒకవేళ వెనక్కి తగ్గితే, దానిని బలహీనతగా భావించి ట్రంప్ మరింత రెచ్చిపోతారని, తమ అణు కేంద్రాలపై దాడులు చేస్తారని ఇరాన్ భయపడుతోంది. గతంలో అణు ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా తప్పుకోవడం వల్ల కలిగిన అపనమ్మకం ఇక్కడ ప్రధాన అడ్డంకిగా మారింది. అందుకే తగ్గేదేలే అన్నట్లుగా ఇరాన్ తన ప్రతిఘటనను కొనసాగిస్తోంది .ప్రస్తుతం జరుగుతోంది ఇది కేవలం క్షిపణుల యుద్ధం మాత్రమే కాదు.. ఈగోల వార్. ట్రంప్ తన ఇమేజ్‌ను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటే, ఇరాన్ తన మనుగడ కోసం పోరాడుతోంది. ఇరు పక్షాల మధ్య బలమైన మధ్యవర్తిత్వం లేకపోవడం వల్ల యుద్ధం ఆగే సూచనలు కనిపించడం లేదు.











