ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేద్దాం – కొండేపాటి గంగాప్రసాద్ పిలుపు నెల్లూరు జిల్లా: రాష్ట్రంలో ప్రతి పేదవానికి సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ నాయకుడు కొండేపాటి గంగాప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ నెల 30న నాయుడుపేట మండలం బిరదవాడలో టిడ్కో గృహాల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేయనున్న సందర్భంగా ఆయన పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. ఈ నేపథ్యంలో సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన వివిధ మండలాల అధ్యక్షులు, కార్యకర్తలతో నాయుడుపేటలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు. నెలవల సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కొండేపాటి గంగాప్రసాద్ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. టిడ్కో గృహాల ప్రారంభోత్సవం రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యత కలిగిన కార్యక్రమమని, ముఖ్యమంత్రి మన ప్రాంతానికి రావడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ సభను ఘనంగా నిర్వహించి ప్రభుత్వ సంకల్పాన్ని ప్రజల్లో మరింత బలంగా చాటాలని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులందరూ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఇదే సమావేశంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. నాయుడుపేట మాజీ ఏఎంసీ చైర్మన్ శిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా పార్టీకి సేవలందిస్తున్న కొండేపాటి గంగాప్రసాద్ చట్టసభలోకి అడుగుపెట్టాలని నాయకులు, అభిమానుల ఆకాంక్షను నెరవేర్చాలని కోరారు. దీనికి స్పందించిన కొండేపాటి గంగాప్రసాద్ తెలుగుదేశం పార్టీపై తనకు అపారమైన అభిమానం ఉందని, పార్టీ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరిస్తానని తెలిపారు. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.













