
పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఉన్న ద్రౌపది షాపింగ్ కాంప్లెక్స్‌కు చెందిన దుకాణాలను మున్సిపల్ అధికారులు నేడు సీజ్ చేయడం జరిగింది. అనేక సంవత్సరాలుగా మున్సిపాలిటీకి చెల్లించవలసిన పన్నులు చెల్లించకపోవడంతో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.వివరాలు ఇలా ఉన్నాయి ద్రౌపది షాపింగ్ కాంప్లెక్స్‌లో ఉన్న దుకాణదారులు మున్సిపల్ పన్నులను నిర్లక్ష్యం చేస్తూ రావడంతో లక్షలాది రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం, ఈ కాంప్లెక్స్‌కు సంబంధించిన మొత్తం బకాయిలు 25 లక్షల రూపాయలకు పైగా ఉన్నట్లు వెల్లడించారు. పన్నులు చెల్లించాల్సిందిగా మున్సిపాలిటీ తరఫున పలుమార్లు సూచనలు ఇచ్చినప్పటికీ స్పందన లేకపోవడంతో రెండు రోజుల క్రితం అధికారికంగా నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
అయితే, నోటీసులు ఇచ్చినప్పటికీ దుకాణదారులు పన్నులు చెల్లించకపోవడంతో మున్సిపల్ అధికారులు కఠిన నిర్ణయం తీసుకుని నేడు దుకాణాలను సీజ్ చేశారు. ఈ ప్రక్రియలో మున్సిపల్ సిబ్బంది మరియు వ్యాపారస్తుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. దుకాణదారులు తమ వాదనలో, తాము దేవాదాయ శాఖకు పన్నులు చెల్లిస్తున్నామని, మున్సిపాలిటీకి అదనంగా చెల్లించడం కష్టమని పేర్కొన్నట్లు సమాచారం. అయితే, మున్సిపల్ కమిషనర్ దీనిని ఖండిస్తూ, మున్సిపాలిటీకి చెల్లించాల్సిన పన్నులు వేరని, అవి తప్పనిసరిగా చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు.సీజ్ చర్యల అనంతరం కొంతమంది దుకాణదారులు తమ బకాయిలను వెంటనే చెల్లించేందుకు ముందుకు రావడంతో, సంబంధిత దుకాణాలను తిరిగి తెరవడానికి అనుమతి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారు కూడా త్వరలోనే పన్నులు చెల్లించాలని సూచించారు.ఈ సందర్భంగా కమిషనర్ వెంకటేశ్వర్లు పట్టణ ప్రజలకు ముఖ్యంగా వ్యాపారస్తులకు విజ్ఞప్తి చేశారు. పన్నులు సకాలంలో చెల్లించడం ప్రతి పౌరుని బాధ్యత అని, ఈ ఆదాయంతోనే పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయగలమని అన్నారు. రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలకు పన్నులే ప్రధాన ఆధారం అని వివరించారు.మున్సిపల్ అధికారులు చేపట్టిన ఈ చర్య పట్టణంలో ఇతర వ్యాపారస్తులకు కూడా హెచ్చరికగా మారింది. పన్నులు చెల్లించని వారికి భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు. దీంతో గూడూరు పట్టణంలో మున్సిపల్ పన్నుల చెల్లింపులపై చైతన్యం పెరగాలని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.













