
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కంటేపల్లి గ్రామంలో బాల్య వివాహాలను అరికట్టడంలో పోలీసుల చొరవ ప్రశంసనీయంగా నిలిచింది. గ్రామంలోని కాలనీలో మైనర్ బాలికలకు వివాహాలు జరిపేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం అందడంతో వెంటనే అప్రమత్తమైన జిల్లా పోలీసులు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ అజిత వాజెండ్ల ఆదేశాల మేరకు, రూరల్ డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు సూచనలతో మహిళ పోలీస్ స్టేషన్, స్థానిక పోలీస్ సిబ్బంది, ఐసీడీఎస్ అధికారులు, సీడీపీవో విజయలక్ష్మి, అంగన్వాడి సిబ్బంది, గ్రామ పెద్దలు కలిసి కంటేపల్లి గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు.బాల్య వివాహాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, చట్టపరమైన ఇబ్బందులు, బాలికల భవిష్యత్తుపై పడే ప్రతికూల ప్రభావాలను వివరించి, ఈ వివాహాలను వెంటనే నిలిపివేయించారు. రెండు రోజుల వ్యవధిలో మూడు బాల్య వివాహాలను అడ్డుకోవడం ద్వారా మైనర్ బాలికల జీవితాల్లో చీకట్లు తొలగించి, వారి భవిష్యత్తుకు వెలుగులు నింపారు. పోలీసుల చర్యలపై గ్రామ ప్రజలు, బాలికలు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, బాల్య వివాహాలు ఆడబిడ్డల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తాయని తెలిపారు. తల్లిదండ్రులు ఆడబిడ్డలను భారంగా కాకుండా మహాలక్ష్మిగా భావించి చదివించి, మంచి భవిష్యత్తు కల్పించాలని సూచించారు. ఎవరైనా బాల్య వివాహాలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎస్పీ అజిత వాజెండ్ల కూడా బాల్య వివాహాల నిర్మూలనకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి ఒక్కరూ చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.













