
బాపట్ల పట్టణంలో హెల్మెట్ వినియోగంపై పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, డిఎస్పీ జగదీష్ నాయక్ నేతృత్వంలో, పట్టణ సీఐ రాంబాబు ఆధ్వర్యంలో చీల్ రోడ్డు సెంటర్ వద్ద శనివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఐ రాంబాబు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ తలకు రక్షణ కవచంగా పనిచేస్తుందని, ప్రమాదాల సమయంలో తీవ్రమైన గాయాలు మరియు ప్రాణనష్టం తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వల్ల అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, కేవలం నిర్లక్ష్యంతో విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనాలపై త్రిబుల్ రైడింగ్ చేయరాదని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని హెచ్చరించారు. అలాగే వాహనాలు నడిపేటప్పుడు అతివేగం వద్దని, ముందున్న వాహనాల నుండి తగిన దూరం పాటించాలని తెలిపారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ తమకే కాకుండా ఇతరులకు కూడా ప్రమాదకరమని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ కొంచెం ఆలోచించి హెల్మెట్ ధరించడం ద్వారా తమ కుటుంబాలకు అండగా నిలవాలని, హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సై విజయ్ కుమార్, ఉమెన్ ఎస్సై నశ్రీన్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు మరియు వాహనదారులు పాల్గొన్నారు.













