చేనేతలకు ఉచిత విద్యుత్ – ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ వెల్లడి

రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి కీలక నిర్ణయం తీసుకుందని, నేటి నుండి 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగాన్ని ఉచితంగా అందించనున్నట్లు గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తెలిపారు. ఈ నిర్ణయం వల్ల అనేకమంది చేనేత కార్మికులకు పెద్ద ఉపశమనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు చేనేత కార్మికుల ఇళ్లను సందర్శించి, వారికి పెన్షన్లు అందజేశారు. అనంతరం మగ్గాలను పరిశీలించి, చేనేత పరిస్థితులపై అవగాహన పొందారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్నికల విజయానికి చేనేతల సహకారం ఎంతో కీలకమని, వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేతలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు, మరమగ్గాల వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తుందని వెల్లడించారు.
అదేవిధంగా, కొంతమంది చేనేతల విద్యుత్ మీటర్లు మృతులైన కుటుంబ పెద్దల పేర్లపై ఉండడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని వారి ద్వారా తెలిసిందని తెలిపారు. ఈ విషయంపై విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడామని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు.ఇంకా, ఎవరైనా అనారోగ్యంతో చికిత్స పొందినట్లయితే, వారి వైద్య ఖర్చుల రసీదులను ఎమ్మెల్యే కార్యాలయానికి అందజేస్తే, సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ నాయకులు కరుణాకర్ రెడ్డి, మట్టం శ్రావణి, లీలావతి తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam