గూడూరులో కార్డన్ సెర్చ్… భద్రతపై ప్రత్యేక దృష్టిప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు

గూడూరు పట్టణంలో శాంతిభద్రతలను కాపాడే లక్ష్యంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గూడూరు పట్టణ మరియు గ్రామీణ సర్కిల్ అధికారుల సమన్వయంతో బనిగాసాహెబ్ పేట ప్రాంతంలో విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు సుమారు 200 ఇళ్లలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఈ సోదాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. తనిఖీలలో భాగంగా సరైన పత్రాలు లేని 10 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నంబర్ ప్లేట్లు సరిగా లేని వాహనాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి, వాహనదారులకు అవసరమైన పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. ఈ సోదాలతో పాటు ప్రజల్లో భద్రతపై అవగాహన పెంపొందించేందుకు పోలీసులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. రహదారి భద్రతపై మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, మైనర్లు వాహనాలు నడపకూడదని, అతి వేగం వల్ల జరిగే ప్రమాదాల గురించి విద్యార్థులకు వివరించారు. అలాగే సైబర్ నేరాల నివారణపై ప్రజలకు సూచనలు ఇచ్చారు. OTPలు మరియు వ్యక్తిగత వివరాలను తెలియని వ్యక్తులకు ఇవ్వకూడదని హెచ్చరించారు. ఆన్‌లైన్ మోసాలకు గురైనట్లయితే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
పోలీసు అధికారులు మాట్లాడుతూ, పట్టణంలో శాంతిభద్రతలను కాపాడటం, నేరగాళ్ల కదలికలను నియంత్రించడం మరియు ప్రజల్లో పోలీసులపై నమ్మకాన్ని పెంపొందించడం కోసం ఈ విధమైన కార్డన్ సెర్చ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. స్థానిక ప్రజలు పోలీసులకు సహకరించి, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు సహకరించడంతో సోదాలు ప్రశాంతంగా పూర్తయ్యాయని పోలీసులు తెలిపారు.ఈ కార్డన్ సెర్చ్ కార్యక్రమంలో 1 టౌన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ల సి ఐలు, ఎస్ ఐలు మరియు పోలీసు సిబ్బంది, అలాగే రూరల్ పోలీస్ స్టేషన్ మరియు చిల్లకూరు పోలీస్ స్టేషన్ సి ఐలు, ఎస్ ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

error: Content is protected !!
Prajaveek Shanam