
గూడూరు మండల పరిధిలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి మరో ముఖ్యమైన అడుగు పడింది. NABARD–రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (RIDF) నిధుల ద్వారా రూ. 3 కోట్ల 41 లక్షల వ్యయంతో గూడూరు–జయంపు R&B రోడ్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
7.40 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్న ఈ రహదారిలో BT రోడ్ మరియు CC రోడ్ పనులు చేపట్టనున్నారు. ఈ పనులకు సంబంధించి వెందోడు గ్రామం నందు శంఖుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ శ్రీ పాశిం సునీల్ కుమార్ గారు రోడ్ పనులకు శంఖుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారి సదుపాయాలు కల్పించడం ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా, ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడుతుందని తెలిపారు.
ఈ రహదారి గూడూరు మరియు పరిసర గ్రామాల ప్రజలకు ప్రయాణ సౌకర్యం సులభతరం అవుతుందని, ముఖ్యంగా రైతులు తమ పంటలను మార్కెట్లకు తరలించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.













