
రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రజలపై అదనపు భారం పడకుండా చర్యలు చేపడుతున్నామని ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, 2019–24 కాలంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) రద్దు చేయడం మరియు నిర్వహణ లోపాల కారణంగా అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చిందన్నారు. పీపీఏల రద్దు కారణంగా విద్యుత్ వినియోగం లేకపోయినా సుమారు రూ.9 వేల కోట్ల ప్రజాధనాన్ని చెల్లించాల్సి వచ్చిందని వివరించారు. గత పాలకుల నిర్ణయాల వల్ల వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపి ట్రూ-అప్ ఛార్జీలు వసూలు చేసిన పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు.రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు ఆర్టీసీ బస్సులను దశల వారీగా ఏసీ ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ప్రణాళిక అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. పర్యావరణ హిత రవాణాను ప్రోత్సహించే దిశగా గ్రీన్ ఈవీ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇందులో భాగంగా ఆర్టీసీ సంస్థ 1,050 ఎలక్ట్రిక్ బస్సులను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు సుమారు 5 వేల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ చర్యల ద్వారా కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ప్రజలకు తక్కువ ఖర్చుతో ప్రయాణ సౌకర్యాలు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు.అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు రాష్ట్రంలో 40 లక్షల ఇళ్లకు సోలార్ రూఫ్‌టాప్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM Surya Ghar Yojana కింద ప్రతి ఇంటిపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు.ప్రతి ఇంటిలోనే విద్యుత్ ఉత్పత్తి జరిగి అదే చోట వినియోగించే విధానం అమల్లోకి వస్తే ట్రాన్స్మిషన్ నష్టాలు తగ్గడంతో పాటు విద్యుత్ ఖర్చులు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని శక్తి పరంగా స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పలు సంస్కరణలు చేపడుతోందని ఆయన స్పష్టం చేశారు.












