అధికారుల తీరుపై గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఆగ్రహం

గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ వ్యాఖ్యలు — రైతు సమస్యలపై ఆగ్రహం

నెల్లూరు రైతులకు గిట్టుబాటు ధరల విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా IAB (ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డ్) సమావేశంకు తొలిసారిగా హాజరైన ఆయన, రైతుల సమస్యలపై అధికారుల నిర్లక్ష్య ధోరణిని తీవ్రంగా తప్పుబట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో తాము తిరుపతి జిల్లాలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం నెల్లూరు జిల్లా పరిధిలో రైతుల సమస్యలు అధికంగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా రైతులకు గిట్టుబాటు ధరల విషయంలో అధికారులు సరైన సమాధానాలు ఇవ్వడం లేదని, ఎమ్మెల్యే అయిన తనకే సరైన వివరాలు ఇవ్వకపోవడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.అలాగే నియోజకవర్గంలోని పలు గ్రామాలకు సాగునీరు అందించాల్సిన అత్యవసరత ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాండ్ర, పారిచర్ల, వెండోడు వంటి అనేక గ్రామాల చెరువులకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా స్వర్ణముఖి బ్యారేజ్‌కు కనీసం 2 టీఎంసీలు నీరు విడుదల చేస్తే దాదాపు 10 వేల ఎకరాల్లో పంటలు సాగు చేయవచ్చని తెలిపారు. అందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.యల్లసిరి కాలువ పనులు ఇంకా అసంపూర్తిగా ఉండటంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కాలువ పూర్తయితే దాదాపు 10 వేల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు చిట్టమూరు మండలంలోని అనేక గ్రామాలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.దుగ్గరాజుపట్నం కాలువ విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. గతంలో తాను ప్రభుత్వం నుండి తీసుకొచ్చిన జీవోను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని, ప్రస్తుతం ఆ కాలువ పనులకు తిరిగి అనుమతులు మంజూరు చేయాలని అధికారులను కోరారు. ఈ కాలువ పూర్తయితే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గూడూరు నియోజకవర్గానికి తగినంత సాగునీరు అందించేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. రైతుల ప్రయోజనాలను కాపాడడం ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉండాలని, సాగునీటి సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

error: Content is protected !!
Prajaveek Shanam