తిరుమూరులో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం నిర్వహణ
వాకాడు, ఏప్రిల్ 24:( ప్రజా వీక్షణం)
తిరుపతి జిల్లా వాకాడు మండలం తిరుమూరు
గ్రామంలో పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం తిరుమూరు పంచాయతీ ప్రత్యేక అధికారి దీప ఆధ్వర్యంలో తిరుమూరు పంచాయతీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కుంచం దయాకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామీణాభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. గ్రామస్థాయి పాలన బలోపేతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆయన అన్నారు.
“పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా గ్రామాలు స్వయం సమృద్ధిగా మారాలి. ప్రతి ఇంటికీ మౌలిక సదుపాయాలు చేరేలా పారదర్శక పరిపాలన జరగాలి. ప్రజల అవసరాలను గుర్తించి, వేగంగా స్పందించే విధంగా గ్రామ పాలన ఉండాలి” అని *దయాకర్ తెలిపారు.
పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామ ప్రజలకు స్వీట్లు పంపిణీ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. పంచాయతీ పరిధిలోని అన్ని ప్రాంతాలకు తాగునీరు, రహదారులు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేయాలని దయాకర్ సూచించారు.
ఈ సందర్భంగా వాకాడు మండల వ్యవసాయ అధికారి తిరుమూరు గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి దీప మాట్లాడుతూ, “గ్రామ అభివృద్ధి కోసం అందరి సహకారంతో పంచాయతీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తాము” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, మహిళా కానిస్టేబుల్, సచివాలయం సిబ్బంది, గ్రామ ప్రజలు మరియు ఇతరులు పాల్గొన్నారు.













