
దేశం, విదేశాల నుంచి వేలాది మంది భక్తులు నిత్యం తిరుమల శ్రీవారి ఆలయం దర్శనానికి తరలివస్తున్నారు. ముఖ్యంగా విమాన మార్గంలో వచ్చే భక్తులకు సౌకర్యంగా ఇప్పటికే తిరుపతి రేణిగుంట విమానాశ్రయం వద్ద శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. రోజువారీగా సుమారు 1500 శ్రీవాణి టికెట్లు జారీ అవుతుండగా, వాటిలో 500 ఆన్లైన్ ద్వారా, 800 ఆఫ్లైన్ ద్వారా, మిగిలిన 200 టికెట్లు ఎయిర్పోర్ట్లో అందిస్తున్నారు. అయితే ఈ 200 టికెట్లు ముందుగా వచ్చే భక్తులే ఎక్కువగా పొందడంతో, తర్వాత వచ్చే వారికి టికెట్లు దొరకడం కష్టమవుతోందని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో టీటీడీ మరో కొత్త ఆలోచనపై దృష్టి సారించినట్లు సమాచారం. తిరుపతి తరహాలోనే విజయవాడ గన్నవరం విమానాశ్రయం లో కూడా శ్రీవాణి దర్శన టికెట్లు జారీ చేయాలని ప్రతిపాదన సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజూ సుమారు 100 టికెట్లు జారీ చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారని సమాచారం. ఈ నిర్ణయం అమలైతే గుంటూరు, విజయవాడ, ఉభయ గోదావరి జిల్లాల భక్తులకు పెద్ద ఎత్తున సౌకర్యం కలగనుంది. ఈ ప్రతిపాదనను త్వరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఆమోదం పొందిన తర్వాత అమలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ అంశంపై టీటీడీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా సమకూరే నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 5,000 ఆలయాల నిర్మాణానికి టీటీడీ ప్రణాళిక రూపొందిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో పలు ఆలయాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని సూచించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా తిరుమలలో శ్రీవారి సేవ కార్యక్రమాలపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. సేవకులకు ముందస్తు శిక్షణ, భక్తులకు మెరుగైన సేవలందించే విధానం, సేవకుల పనితీరును సమర్థత ఆధారంగా రేటింగ్ చేయడం, ఫిర్యాదుల పరిష్కారం కోసం కేంద్రీకృత గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. ప్రత్యేక ఫిర్యాదు నంబర్ ద్వారా సేవకుల సమస్యలను తక్షణమే పరిష్కరించే విధానం తీసుకురావాలని నిర్ణయించారు. అలాగే సత్సంగ కార్యక్రమాల ద్వారా సేవాభావం, క్రమశిక్షణ పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. తిరుమలలో రద్దీ ప్రాంతాల్లో నైతిక, ఆధ్యాత్మిక విలువలను తెలియజేసే సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం, భక్తులు, సేవకులు, ఉద్యోగుల మానసిక ప్రశాంతత కోసం హీలింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం వంటి నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు సమాచారం.మొత్తానికి విజయవాడ ఎయిర్పోర్ట్లో శ్రీవాణి దర్శన టికెట్ల జారీ ప్రతిపాదన అమలైతే భక్తులకు మరింత సౌకర్యం కలగనుందని భావిస్తున్నారు. త్వరలో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశముంది.












