
ఆంధ్రప్రదేశ్లో ఎక్సైజ్ పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉపశమనం కల్పించింది. బార్లు మూసివేసినట్లు అర్ధరాత్రి వెళ్లి ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాల్సిన నిబంధనను సడలిస్తూ ఎక్సైజ్ శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.ఇప్పటివరకు ప్రతి రోజూ రాత్రి 12 గంటల తర్వాత బార్లు మూసివేశారో లేదో నిర్ధారించేందుకు ఎక్సైజ్ కానిస్టేబుళ్లు ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లి ఫోటోలు తీసి ఎక్సైజ్ ఐ యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉండేది. ఈ విధానం కారణంగా రాత్రి వేళల్లో విధులు నిర్వర్తించడం వారికి కష్టసాధ్యంగా మారింది.ఇకపై ఈ నిబంధనలో మార్పులు చేస్తూ, బార్లు మూసివేసిన విషయాన్ని సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా లేదా వీడియో కాల్ ద్వారా నిర్ధారించుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. దీంతో అర్ధరాత్రి సమయంలో ప్రత్యక్షంగా వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది.ఇటీవల విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకున్న దుర్ఘటన ఈ నిర్ణయానికి కారణమైంది. ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ సింహాచలం నాయుడు విధి నిర్వహణలో భాగంగా అర్ధరాత్రి బార్ల ఫోటోలు తీసి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ సంఘటన తర్వాత ఉద్యోగ సంఘాలు నిబంధన సడలించాలని ప్రభుత్వాన్ని కోరాయి.ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి కొత్త మార్గదర్శకాలను అమలు చేయాలని నిర్ణయించింది. అలాగే సింహాచలం నాయుడు కుటుంబానికి అండగా నిలుస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. తక్షణ సహాయంగా రూ.10 లక్షలు అందించాలని, బీమా పథకం ద్వారా సుమారు రూ.1.10 కోట్ల ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కుటుంబంలో అర్హులైన వ్యక్తికి కారుణ్య నియామకంగా ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు.
విశాఖపట్నం జిల్లా తాటిచెట్లపాలెం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో సింహాచలం నాయుడు బైక్ను వేగంగా వచ్చిన మరో బైక్ ఢీకొట్టడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ప్రమాదానికి కారణమైన ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ నిర్ణయంతో ఎక్సైజ్ సిబ్బందిపై ఉండే ఒత్తిడి తగ్గడంతో పాటు భద్రత కూడా మెరుగుపడుతుందని భావిస్తున్నారు.












