
అనకాపల్లి, ఏప్రిల్ 25: జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు, నర్సీపట్నం సబ్ డివిజన్ అధికారి పి. శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ నిర్వహించారు.నర్సీపట్నం రూరల్ సర్కిల్ పరిధిలోని గొలుగొండ మండలం రావణపల్లి గ్రామానికి చెందిన గొర్లి గంగు నాయుడు @ చిన్న (28), తండ్రి లేట్ నూకరాజు, వృత్తి డ్రైవర్గా ఉన్న ఈ వ్యక్తి గత కొంతకాలంగా అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి అనకాపల్లి మరియు ఇతర ప్రాంతాలకు గంజాయి అక్రమ రవాణా చేస్తూ అలవాటుగా నేరాలకు పాల్పడుతున్నాడని పోలీసులు గుర్తించారు.ఇతనిపై ఇప్పటికే గొలుగొండ, పాయకరావుపేట పోలీస్ స్టేషన్లతో పాటు ప్రకాశం జిల్లా టంగుటూరు పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదయ్యాయి. గతంలో పలుమార్లు గంజాయి కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదని పోలీసులు తెలిపారు.
సమాజంపై, ప్రజారోగ్యంపై అతని చర్యలు తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు 1988 PIT NDPS చట్టం కింద ప్రివెంటివ్ డిటెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలో, గొలుగొండ ఎస్సై రామారావు, ఎన్డీపీఎస్ సెల్ ఇన్స్పెక్టర్ పిల్లా రమేష్ మరియు సిబ్బంది కలిసి నిందితుడిని అదుపులోకి తీసుకుని పకడ్బందీగా జైలుకు తరలించారు.
ఈ సందర్భంగా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై నిరంతర నిఘా కొనసాగుతుందని, చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా పదేపదే నేరాలకు పాల్పడే వారిపై ఇలాంటి కఠిన చట్టాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.












