
గూడూరు పట్టణం:
చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపడానికి వచ్చిన చేనేతలను గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ తన నివాసంలో కలిసి అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గూడూరు నియోజకవర్గంలోని చెన్నూరు, నెలబల్లి, రెట్టపల్లి, హిందూరు కోట ప్రాంతాలకు చెందిన చేనేత కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నదని తెలిపారు. ఈ పథకం ద్వారా మూడు మండలాలు మరియు పట్టణానికి చెందిన సుమారు 330 మంది చేనేత కార్మికులు లబ్ధి పొందుతున్నారని వివరించారు.
చెన్నూరు గ్రామ నాయకురాలు మట్టం శ్రావణి రెడ్డి కృషిని ఎమ్మెల్యే ప్రశంసించారు. గ్రామ సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం అయ్యే వరకు పట్టుదలగా పని చేయడం వల్లే ఆమె రాష్ట్ర స్థాయి బాధ్యతలు పొందినట్లు పేర్కొన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం చేనేతలకు ఉచిత విద్యుత్ అందిస్తున్న కూటమి ప్రభుత్వం మాట తప్పని ప్రభుత్వం అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలా హామీలు మాత్రమే కాకుండా అమలు చేసే ప్రభుత్వం ఇదేనని అన్నారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ చేనేతలకు ఉచిత కరెంట్ అందిస్తున్నామని పేర్కొంటూ, ఈ పథకం అమలుకు సహకరించిన కేంద్ర మరియు రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.చేనేత కార్మికుల తరపున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.













