
చిల్లకూరు, మే 9: గత ప్రభుత్వ హయాంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయని, వాటిని వెంటనే గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ అధికారులను ఆదేశించారు. చిల్లకూరులోని రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను ఆలకించారు. ప్రజల సమస్యలను ఆయా శాఖల అధికారులు వీలైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిల్లకూరు మండలంలో ఉన్న ప్రభుత్వ భూములను పూర్తిస్థాయిలో గుర్తించి, వాటికి బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. లేకపోతే అవి ఆక్రమణలకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. గ్రామాల్లో విలేజ్ సర్వేయర్ల అవినీతి పరాకాష్టకు చేరుకుందని ఆరోపిస్తూ, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.గత పాలనలో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయని, తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారు ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. టిడిపి నాయకులు ప్రభుత్వ భూములను ఆక్రమించినా తన దృష్టికి తీసుకువస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పేద ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని ఎమ్మెల్యే హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గోపీనాధ్ రెడ్డి, టిడిపి మండల అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి, కార్యదర్శి నెలటూరు చిరంజీవి, నాయకులు పట్టాభిరామి రెడ్డి, కొండా రామచంద్రా రెడ్డి, సీ.ఎ రామచంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.













