తిరుపతి కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ సమస్యలపై వినతులు

*బాధితులకు నష్టపరిహారం త్వరగా మంజూరు చేయాలని వినతి*

తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంలో తిరుపతి జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు ఏసుపాకు పెంచలయ్య, గూడూరు డివిజన్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు రావూరు సురేంద్ర పాల్గొని ప్రజా సమస్యలు, ఎస్సీ, ఎస్టీల భూ సమస్యలు, అట్రాసిటీ కేసులకు సంబంధించిన పలు అంశాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. గూడూరు నియోజకవర్గ శాసన సభ్యులు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు నియోజకవర్గ ప్రజా సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించిన భూ సమస్యలు, అట్రాసిటీ కేసుల్లో బాధితులకు ప్రభుత్వం అందించాల్సిన నష్టపరిహారం ఆలస్యమవుతోందని పేర్కొన్నారు.
గూడూరు మండల పరిధిలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు తక్షణమే నష్టపరిహారం మంజూరు చేయాలని వారు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. అదేవిధంగా ఇతర మండలాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ కుటుంబాల భూ సమస్యలపై కూడా పలువురు బాధితుల తరఫున అర్జీలు అందజేశారు.అలాగే గూడూరు మండలంలోని పాత ఎన్ఆర్ఈజీఎస్ పనులకు సంబంధించిన సమస్యలను కూడా అధికారులు దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా సీసీ రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో గ్రామాల అభివృద్ధి పనులు ప్రభావితమవుతున్నాయని దివిపాలెం పంచాయతీ మాజీ సర్పంచ్ నరసరాజు కలెక్టర్‌కు వివరించారు. పెండింగ్ బిల్లులను వెంటనే పరిష్కరించి సంబంధిత వారికి చెల్లింపులు జరిపించాలని కోరారు.
వినతులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ బాధితులకు ప్రభుత్వం అందించాల్సిన నష్టపరిహారం త్వరితగతిన మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చురుకుగా స్పందించి బాధితులకు న్యాయం చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో గాంధీనగర్ టీడీపీ బూత్ కన్వీనర్ దానం శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam