రొయ్యల ఫీడ్ ధరల పెంపుపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం

రొయ్యల ఫీడ్ ధరల పెంపుపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం
రైతులపై అదనపు భారం మోపొద్దంటూ ఫీడ్ కంపెనీలకు నోటీసులు

రాష్ట్రంలోని ఆక్వా రైతులను ఇబ్బందులకు గురిచేసే విధంగా రొయ్యల ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచడం సమంజసం కాదని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
రొయ్యల ఫీడ్ తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలు పెరిగిన నేపథ్యంలో వనామీ ఫీడ్‌పై కిలోకు రూ.8, టైగర్ రొయ్యల ఫీడ్‌పై కిలోకు రూ.10 చొప్పున ధరలు పెంచినట్లు సమాచారం అందిందన్నారు. ఇప్పటికే సాగు వ్యయాలు అధికమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులపై ఈ ధరల పెంపు మరింత భారం మోపే పరిస్థితి తీసుకొచ్చిందని పేర్కొన్నారు.
APSADA చట్టం ప్రకారం రైతు సంఘాలతో చర్చించిన అనంతరమే ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, ఫీడ్ కంపెనీలు నిబంధనలు పాటించకుండా వ్యవహరించడం ఆందోళనకరమన్నారు. ఈ విషయంపై ఫిషరీస్ కమిషనర్ ఇప్పటికే ఫీడ్ తయారీ సంస్థలకు రైతులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించినప్పటికీ, ధరల పెంపును అమలు చేయడం సరికాదని మంత్రి అభిప్రాయపడ్డారు.
రైతుల సమస్యలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిగణిస్తోందని పేర్కొన్న మంత్రి అచ్చెన్నాయుడు, పెంచిన ధరల అమలును వెంటనే నిలిపివేయాలని సంబంధిత ఫీడ్ తయారీ సంస్థలకు ఫిషరీస్ కమిషనర్ ద్వారా నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
అలాగే ఈ అంశంపై రైతు సంఘాలు, ఫీడ్ తయారీ సంస్థల ప్రతినిధులతో బుధవారం సమావేశం నిర్వహించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని లక్షలాది ఆక్వా రైతుల ప్రయోజనాలను కాపాడటంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతు పక్షానే నిలుస్తుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam