గూడూరులో హత్య కేసు ఛేదన.. ముద్దాయిని అరెస్ట్ చేసిన పోలీసులు

గూడూరు :-
గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నూరు గ్రామంలో జరిగిన హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించి ముద్దాయిని అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల, ఐపీఎస్ ఆదేశాల మేరకు గూడూరు ఇన్‌చార్జ్ డీఎస్పీ ఎం. గిరిధర్ పర్యవేక్షణలో గూడూరు రూరల్ సీఐ ఎన్. కిషోర్ బాబు నేతృత్వంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. సీఐ కిషోర్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. ముద్దాయి మహమ్మద్ సమీ (19), ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగర్ జిల్లాకు చెందినవాడు. మృతుడు షేహన్స్ (20) కూడా అదే ప్రాంతానికి చెందినవాడు. ఇద్దరూ ఉపాధి నిమిత్తం గూడూరు మండలంలోని చెన్నూరు గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఈ నెల 07-05-2026న మద్యం మత్తులో ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో నిందితుడు కత్తితో దాడి చేయగా షేహన్స్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం పరారీలోకి వెళ్లిన నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు తన కోసం గాలిస్తున్నారని తెలుసుకున్న నిందితుడు 15-05-2026న తాను పనిచేస్తున్న కాంట్రాక్టర్‌తో కలిసి గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు వెల్లడించారు. అనంతరం ముద్దాయిని అరెస్ట్ చేసి కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ కిషోర్ బాబు తెలిపారు. ఈ కేసు ఛేదనలో గూడూరు రూరల్, గూడూరు టౌన్, చిల్లకూరు పోలీస్ అధికారుల సమన్వయం, సిబ్బంది కృషి కీలకంగా నిలిచిందన్నారు. జిల్లా ఎస్పీ మార్గదర్శకత్వం, అధికారుల సహకారంతో కేసును త్వరితగతిన ఛేదించగలిగామని పేర్కొన్నారు. ఈ కేసు ఛేదనలో గూడూరు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎన్. కిషోర్ బాబు, వన్‌టౌన్ శేఖర్ బాబు, ఎస్‌ఐలు కె. తిరుపతయ్య, పి. వెంకటేశ్వర రెడ్డి, ఎ. సురేష్ బాబు, హెడ్ కానిస్టేబుళ్లు షేక్ మహ్మద్, కె. శ్రీనివాసరావు, పి. శ్రీనివాసులు, పోలీస్ కానిస్టేబుళ్లు డి. నాగరాజు, వి. విష్ణు, సి.హెచ్. శ్రీనివాసులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam