
నగదు, దుబాయ్ దిర్హమ్స్, మొబైల్ ఫోన్లు, స్కూటర్ స్వాధీనం
కేసు పూర్తి వివరాలు వెల్లడించిన పట్టణ సీఐ నరహరి
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దోపిడీ కేసును పోలీసులు వేగంగా ఛేదించి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి నగదు, విదేశీ కరెన్సీ, మొబైల్ ఫోన్లు, ఆధార్ కార్డు, పర్స్‌తో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపేట్ మండలం మోతే గ్రామానికి చెందిన గుండ్రెడ్డి రాజు రెడ్డి @ రాజు (24), ప్రైవేట్ ఉద్యోగి, ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ నెల 18వ తేదీ సాయంత్రం తన బంధువు రంజిత్‌తో కలిసి రాజీవ్ నగర్ కాలనీలోని రేణుక ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో ఉండగా రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఐదుగురు వ్యక్తులు వారిని అడ్డగించి బెదిరించి దాడి చేసినట్లు పేర్కొన్నారు.
దుండగులు ఫిర్యాదుదారు వద్ద ఉన్న రూ.4 వేల నగదు, ఆధార్ కార్డును దోచుకోగా, అతని బంధువు వద్ద ఉన్న 300 దుబాయ్ దిర్హమ్స్ను కూడా అపహరించినట్లు తెలిపారు. అంతేకాకుండా ఫిర్యాదుదారుని మొబైల్ ఫోన్ ద్వారా “నావి యాప్” సహాయంతో బలవంతంగా రూ.1,000లను యూపీఐ ఖాతాకు బదిలీ చేయించుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిర్యాదు ఆధారంగా కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో క్రైం నంబర్ 409/2026 కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా దృశ్యాలు, సాక్షుల వాంగ్మూలాలు, సాంకేతిక ఆధారాలను పరిశీలించిన పోలీసులు నిందితుల కదలికలను గుర్తించారు.
ఈ నెల 21వ తేదీన విశ్వసనీయ సమాచారం మేరకు రాజీవ్ నగర్‌లోని డీలక్స్ బేకరీ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. వారిని షేక్ సల్మాన్, మహ్మద్ మొయిజ్, బొందీ లోకేష్, షేక్ షానవాజ్‌తో పాటు ఒక బాల నేరస్తుడు మహ్మద్ మజిత్గా గుర్తించారు.
విచారణలో నిందితులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్లే వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని బెదిరింపులు, దాడులు చేసి దోపిడీలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. బాధితుల వద్ద దోచుకున్న 300 దుబాయ్ దిర్హమ్స్ను కామారెడ్డి పట్టణంలోని మదన్‌లాల్ ఎలక్ట్రానిక్స్ దుకాణంలో భారతీయ కరెన్సీగా మార్చుకొని వచ్చిన మొత్తాన్ని పరస్పరం పంచుకున్నట్లు వెల్లడించారు.
నిందితుల వద్ద నుండి మొత్తం రూ.8,300 నగదు, ఒక ఐఫోన్–15 మొబైల్ ఫోన్, ఒక పోకో మొబైల్, ఒక ఎంఐయూఐ మొబైల్, ఒక శాంసంగ్ మొబైల్ ఫోన్, బాధితుడి ఆధార్ కార్డు, పర్స్, టీఎస్ 23 ఎఫ్ 6835 నంబర్ గల హోండా యాక్టివా స్కూటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా 300 దుబాయ్ దిర్హమ్స్ను కూడా రికవరీ చేశారు.
నిందితులు నిరుద్యోగం, తక్కువ ఆదాయం, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో గుంపుగా ఏర్పడి నేరాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితులను రిమాండ్‌కు తరలించగా, బాల నేరస్తుడిని జువెనైల్ న్యాయ ప్రక్రియ ప్రకారం హాజరుపరిచినట్లు వెల్లడించారు. ఇట్టి చేదించిన పోలీస్ సిబ్బంది మహేందర్ రెడ్డి. శ్రీనివాస్. సిద్దు లను పట్టణ సిఐ నరహరి అభినందించారు
ప్రజలకు పోలీసుల సూచనలు
రాత్రి వేళల్లో ఒంటరిగా నిర్జన ప్రాంతాల్లో తిరగవద్దు.
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్–100కు సమాచారం ఇవ్వాలి.
మొబైల్ ఫోన్ ద్వారా బలవంతంగా డబ్బులు బదిలీ చేయాలని ఒత్తిడి చేసిన సందర్భాల్లో వెంటనే పోలీసులను ఆశ్రయించాలి.
యువత సులభ డబ్బు కోసం నేరాల బాట పట్టకుండా తల్లిదండ్రులు, సమాజం అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.












