గూడూరు పట్టణంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఆపరేషన్ – క్లీన్ స్వీప్” కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించారు. గూడూరు శాసన సభ్యులు మరియు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీ పాశిం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గూడూరు RTC ప్రాంగణంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ పారిశుధ్య కార్మికులతో కలిసి స్వయంగా చెత్తను తొలగించి ట్రాక్టర్లకు లోడ్ చేయించారు. RTC ప్రాంగణం అంతటా పేరుకుపోయిన చెత్తను తొలగించడంతో పాటు పాన్పరాగ్, గుట్కా ఉమ్ములతో మురికిగా మారిన గోడలను శుభ్రం చేసి సున్నం వేయించారు. ప్రజలు ఎక్కువగా రాకపోకలు సాగించే RTC ప్రాంగణాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 123 మునిసిపాలిటీలలో ఈ నెల 23వ తేదీ నుండి జూన్ 20వ తేదీ వరకు “ఆపరేషన్ – క్లీన్ స్వీప్” కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు. పట్టణాల్లో పరిశుభ్రత పెంపొందించడం, ప్రజల్లో అవగాహన కల్పించడం, వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
మునిసిపల్ పరిధిలోని ప్రధాన రహదారులు, డ్రైన్లు, పబ్లిక్ టాయిలెట్లు, చెత్త పేరుకుపోయిన ప్రాంతాలు, కాలనీలు మరియు జనసంచారం అధికంగా ఉండే ప్రదేశాలను ప్రత్యేకంగా శుభ్రపరుస్తామని తెలిపారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.
పారిశుధ్య కార్మికులు ఎండలను సైతం లెక్కచేయకుండా ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం సేవలు అందిస్తున్నారని ఎమ్మెల్యే అభినందించారు. గూడూరును రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.















