
గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. చిల్లకూరు మండలం కడివేడు రెవెన్యూ పంచాయతీ పరిధిలో APIIC ఆధ్వర్యంలో రూ.10 కోట్ల 50 లక్షల వ్యయంతో ఏర్పాటు కానున్న MSME (సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు) ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గూడూరు శాసన సభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీ పాశిం సునీల్ కుమార్ గారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ గ్రామీణ ప్రాంతాల్లో కూడా పరిశ్రమలను తీసుకువస్తోందని తెలిపారు. MSME రంగం బలోపేతం ద్వారా చిన్న వ్యాపారులు, యువ పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు కలుగుతాయని అన్నారు. కడివేడు ప్రాంతాన్ని పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చేయడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు.
ఈ పరిశ్రమల ఏర్పాటుతో ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా వందలాది మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ప్రాంతీయ మౌలిక సదుపాయాల అభివృద్ధి, రవాణా, వ్యాపార కార్యకలాపాలకు కూడా ఈ ప్రాజెక్టు తోడ్పడనుంది.
కార్యక్రమంలో APIIC అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.













