
గూడూరు: ఓటు ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైన ఆయుధమని, ప్రతి ఓటు ఎంతో కీలకమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గూడూరు నియోజకవర్గ ఇన్చార్జి, శాసనమండలి సభ్యుడు మేరీగ మురళి ఆధ్వర్యంలో నిర్వహించిన బూత్ స్థాయి ప్రతినిధుల అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ సభ్యుడు గురుమూర్తి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.సదస్సు ప్రారంభానికి ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడిన కాకాణి, ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియపై కార్యకర్తలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.ప్రతి సంవత్సరం జరిగే సాధారణ ఓటర్ల జాబితా సవరణకు భిన్నంగా ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియ అత్యంత కీలకమైందని తెలిపారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ నిర్దేశిత గడువులోపు నమోదు ఫారాలు పూర్తి చేసి సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించారు. నిర్లక్ష్యం కారణంగా అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోయే అవకాశం ఉందన్నారు.వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కార్యకర్తలు, బూత్ స్థాయి ప్రతినిధులు అప్రమత్తంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చూడటంతో పాటు, అక్రమ ఓట్లు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఓటర్ల నమోదు, పరిశీలన ప్రక్రియ నిర్ణీత కాలంలో కొనసాగనున్నందున ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే వెంటనే పార్టీ నాయకుల దృష్టికి తీసుకురావాలని కోరారు.కార్యకర్తలు, స్థానిక నాయకులకు పార్టీ అధిష్ఠానం పూర్తి ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న కాకాణి, పార్టీ బలోపేతానికి అందరూ సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.












