
గూడూరు, జూన్ 4: పేదలకు సేవ చేయడమే సి.ఆర్. ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని సి.ఆర్. ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడు కె. నారాయణ పేర్కొన్నారు.
చిల్లకూరు మండల పరిధిలోని పారిచెర్లవారిపాలెంలో ప్రముఖ పారిశ్రామికవేత్త చావా వాసుదేవరావు సి.ఆర్. ఫౌండేషన్‌కు ఎకరా స్థలాన్ని దానం చేశారు. ఈ సందర్భంగా ఆ స్థలాన్ని కె. నారాయణతో పాటు ఫౌండేషన్ సభ్యులు పరిశీలించారు.
అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కె. నారాయణ మాట్లాడుతూ, మూడు దశాబ్దాల క్రితం ప్రారంభమైన సి.ఆర్. ఫౌండేషన్ అనేక సామాజిక సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తోందన్నారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ఓల్డ్ ఏజ్ హోమ్ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిందని, ప్రస్తుతం 150 మంది వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తోందని తెలిపారు.
అలాగే మహిళల సాధికారత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, సి.ఆర్. పాలీక్లినిక్, ఎన్ఆర్ఆర్ రీసెర్చ్ సెంటర్, విశాలమైన గ్రంథాలయం తదితర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. గుంటూరులో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఓల్డ్ ఏజ్ హోమ్, అనాథ చిన్నారుల గృహం నిర్మించనున్నట్లు వెల్లడించారు. కడపలో మూడు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన హోమ్‌ను వచ్చే నెల నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు.
గూడూరులో చావా వాసుదేవరావు దాతృత్వంతో, ఆయన సతీమణి మరియు కుమారుడు చావా హర్షవర్ధన్ పేరుతో సి.ఆర్. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా వాసుదేవరావు కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సి.ఆర్. ఫౌండేషన్ సభ్యురాలు పి. పావని, బీకేఎంయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిహెచ్. ప్రభాకర్, సీపీఐ గూడూరు నియోజకవర్గ కార్యదర్శి జి. శశికుమార్, చిల్లకూరు మండల కార్యదర్శి జి. రమేష్, గూడూరు నగర కన్వీనర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.












