కోట ఎంపీపీ ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యం ఖూనీ: కాకాణి గోవర్ధన్ రెడ్డి

కోట, జూన్ 4: కోట మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) ఉప ఎన్నికలో అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కోటలో ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ మేరుగ మురళి, పార్టీ నాయకులు, ఎంపీటీసీలతో కలిసి పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు.కోట ఎంపీపీ ఉప ఎన్నిక జరిగిన ఈ రోజును “బ్లాక్ డే”గా అభివర్ణించిన కాకాణి, వైఎస్సార్‌సీపీ బీ-ఫారంపై గెలిచిన ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురిచేసి, బెదిరింపులకు పాల్పడి అధికార పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరించిందని ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును బేఖాతరు చేసి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీశారని మండిపడ్డారు.
కోట మండలంలో మొత్తం 16 మంది ఎంపీటీసీలలో ఇద్దరు మరణించడంతో 14 మంది సభ్యులతో ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా, అధికార పార్టీ తమ అధికార బలంతో వైఎస్సార్‌సీపీ సభ్యులను అడ్డుకుని, కొందరిని తమ వైపుకు తిప్పుకుందని ఆరోపించారు. సొంతంగా గెలవలేని టీడీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడిందన్నారు.ప్రజలు వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలిపించిన ప్రజాప్రతినిధులను కండువాలు కప్పి తమ విజయంగా ప్రకటించుకోవడం సిగ్గుచేటని, ఇది టీడీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. పార్టీని మోసం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించబోమని, భవిష్యత్తులో వారికి పార్టీలో అవకాశం ఉండదని స్పష్టం చేశారు.
కోట ఉప ఎన్నికల ప్రక్రియపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించి, పిరాయింపుదారులపై రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు.రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని, రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన సాగుతోందని కాకాణి విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తుందని, ప్రజల హక్కుల కోసం అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

error: Content is protected !!
Prajaveek Shanam