
అమరావతి, జూన్ 4: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన 1387వ (50వ) మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు.
వ్యవసాయ శాఖకు చెందిన చిత్తూరు జిల్లాలోని 46.69 ఎకరాల భూమిని పీఎం-కుసుమ్ పథకం కింద సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఎన్ఆర్ఈడీక్యాప్కు 30 ఏళ్ల లీజుకు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు కోసం కేటాయించిన 49.66 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌పై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు తదితర చార్జీల నుంచి మినహాయింపు కల్పించింది.
రాష్ట్రంలో అవయవ దానం, మార్పిడి వ్యవస్థను పారదర్శకంగా నిర్వహించేందుకు ‘ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్–2011’ అమలుకు ఆమోదం తెలిపింది. అలాగే బీచ్ షాక్స్ ఏర్పాటు కోసం కొత్త ఎక్సైజ్ పాలసీ మార్గదర్శకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పోలవరం ఎడమ ప్రధాన కాలువ ప్యాకేజ్–5, 5ఏ పనులకు రూ.796.66 కోట్ల సవరించిన పరిపాలనా అనుమతి మంజూరు చేయగా, బాపట్ల జిల్లాలో కుందేరు డ్రెయిన్ అభివృద్ధి పనులకు రూ.5.17 కోట్లు కేటాయించింది.
అగ్రిగోల్డ్ బాధితుల కేసుల వేగవంతమైన పరిష్కారం కోసం విజయవాడ ప్రత్యేక కోర్టుకు 21 కొత్త పోస్టులను మంజూరు చేసింది. అమరావతిలో “అమరావతి ఐ” పేరుతో లండన్ ఐ తరహా పర్యాటక ప్రాజెక్టు అభివృద్ధికి టెండర్లు పిలవాలని నిర్ణయించింది.
రాష్ట్ర విమానయాన రంగ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ పాలసీ 2026-31కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పాలసీ ద్వారా కొత్త విమానాశ్రయాలు, వాటర్‌డ్రోమ్స్, ఎంఆర్ఓ కేంద్రాలు, కార్గో నెట్‌వర్క్‌ల అభివృద్ధికి ప్రోత్సాహం లభించనుంది.
గ్రామీణ ప్రాంతాల్లో జూలై 1 నుంచి ‘వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామిన్)’ అమలుకు ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా ఉపాధి హామీ రోజులను 100 నుంచి 125 రోజులకు పెంచనున్నారు.
అలాగే పారిశ్రామిక పార్కులు, పర్యాటక ప్రాజెక్టులు, సోలార్ మరియు విండ్ పవర్ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రభుత్వ భూముల కేటాయింపులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అమరావతి ప్రాంతంలో వివిధ సంస్థలకు భూకేటాయింపులు, భూ వినియోగ మార్పులు మరియు పలు ప్రాజెక్టుల సమీక్షకు సంబంధించిన ప్రతిపాదనలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.












