పునపరివారిపాలెం గ్రామానికి రూ.3.99 కోట్ల బీటీ రోడ్డు ప్రారంభం
చిల్లకూరు మండలం పరిధిలోని NH-16 జాతీయ రహదారి నుండి పునపరివారిపాలెం గ్రామం వరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) నిధులతో రూ.3 కోట్ల 99 లక్షల వ్యయంతో నిర్మించిన బీటీ (తారు) రహదారిని గూడూరు నియోజకవర్గ శాసన సభ్యులు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ఘనంగా ప్రారంభించారు.
పెన్వర్ డైరెక్టర్ గంట మధుకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రారంభోత్సవ ఏర్పాట్లు పండుగ వాతావరణాన్ని తలపించాయి. గ్రామ ప్రజలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు.
పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన పొదుపు సందేశాన్ని ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ NH-16 జాతీయ రహదారి నుండి సభా వేదిక వరకు సైకిల్‌పై ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయనతో పాటు పెన్వర్ డైరెక్టర్ గంట మధుకృష్ణ, నానాజీ తదితరులు కూడా సైకిళ్లపై హాజరై ప్రత్యేక సందేశాన్ని ప్రజలకు అందించారు.
అనంతరం రిబ్బన్ కట్ చేసి రహదారిని ప్రారంభించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ, కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఈ రహదారి నిర్మాణం పూర్తి కావడం వెనుక పెన్వర్ డైరెక్టర్ గంట మధుకృష్ణ చేసిన కృషి ఎంతో గొప్పదని కొనియాడారు. రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ప్రతి అంశాన్ని స్వయంగా పర్యవేక్షిస్తూ, అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులు వేగంగా పూర్తయ్యేలా మధుకృష్ణ విశేష కృషి చేశారని ప్రశంసించారు. ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంలో ఆయన పాత్ర అత్యంత కీలకమైందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
గ్రామ ప్రజల చిరకాల కల నెరవేరిన సందర్భంగా సభలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ సందర్భంగా రాష్ట్ర లైవ్‌స్టాక్ డెవలప్మెంట్ డైరెక్టర్ లీలావతి మాట్లాడుతూ, పునపరివారిపాలెం గ్రామ ప్రజలు దాదాపు 25 సంవత్సరాలుగా రహదారి కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. గ్రామ అభివృద్ధికి ఎంతో అవసరమైన ఈ రహదారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే సాకారమైందన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ చొరవతో పాటు గంట మధుకృష్ణ పట్టుదల కారణంగానే ఈ కల నిజమైందని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గంట మధుకృష్ణ సేవలను పలువురు వక్తలు కొనియాడారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు సామాజిక సేవలోనూ ఆయన ముందుంటారని తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల్లో విద్య, వైద్యం, సామాజిక సేవా కార్యక్రమాలకు నిరంతరం సహకారం అందిస్తూ ప్రజల ఆదరణ పొందుతున్నారని చెప్పారు. పెన్వర్ సంస్థ ద్వారా వందలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నారని కొనియాడారు.
గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలకు తనవంతు సహకారం అందిస్తున్న గంట మధుకృష్ణ సేవలు ఆదర్శప్రాయమని పలువురు అభిప్రాయపడ్డారు. గ్రామాభివృద్ధి, ఉపాధి కల్పన, సామాజిక సేవల ద్వారా ఆయన ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, టీడీపీ నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.















