
తిరుపతి జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని పండ్లూరు గ్రామ సమీపంలో సోమవారం సాయంత్రం విషాద ఘటన చోటుచేసుకుంది. రైలు ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
రైల్వే పోలీసుల వివరాల మేరకు, పండ్లూరు గ్రామ సమీపంలో రైలు పట్టాలు దాటుతున్న సమయంలో నెల్లూరు నుంచి చెన్నై వైపు వెళ్తున్న ఎక్స్ప్రెస్ మెమో రైలు యువకుడిని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన విషయాన్ని గుర్తించిన లోకో పైలట్ రైలును నాయుడుపేట రైల్వే స్టేషన్ వరకు తీసుకెళ్లాడు. అనంతరం పరిశీలించగా మృతదేహం రైలు ఇంజన్ ముందు భాగంలో ఇరుక్కుపోయి ఉన్నట్లు గుర్తించారు.
సమాచారం అందుకున్న సూళ్లూరుపేట రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు నాయుడుపేట మండలంలోని చిలమత్తూరు గ్రామానికి చెందిన రాయపు మమాకర్ (25)గా గుర్తించారు. ఆయన అపాచీ పరిశ్రమలో ఉద్యోగం చేస్తూ ప్రస్తుతం సెలవుపై స్వగ్రామంలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
పండ్లూరు గ్రామ సమీపంలో రైలు పట్టాలు దాటే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
యువకుడి ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు.













