ఆర్టీసీ బస్సుల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళల అరెస్టురూ.3.5 లక్షల విలువైన డైమండ్ బంగారు హారం స్వాధీనం

పాకాల, జూన్ 8 (ప్రజా వీక్షణం): ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళా నిందితులను పాకాల పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.3.5 లక్షల విలువైన 32 గ్రాముల డైమండ్ బంగారు హారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

తిరుపతి జిల్లా పోలీసు అధికారి ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు ఆర్టీసీ బస్సుల్లో జరుగుతున్న చోరీలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు, పాకాల పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును దర్యాప్తు చేపట్టారు. ఇన్‌స్పెక్టర్ టి. చిన్న గోవిందు పర్యవేక్షణలో, ఎస్‌ఐ తరుణ్, మహిళా ఎస్‌ఐ నాగ మంజుల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం నిందితుల కదలికలను గమనించి గుర్తించింది.

ఈ నెల 7వ తేదీ సాయంత్రం శంఖంపల్లి ఫ్లైఓవర్ కింద ముగ్గురు మహిళలు జి. దివ్య (31), బి. రాధిక (38), బి. మేరీ (33)లను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అనంతరం నిర్వహించిన విచారణలో వారు నేరాన్ని అంగీకరించడంతో చోరీకి గురైన డైమండ్ బంగారు హారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రాథమిక విచారణలో నిందితులు ఆర్టీసీ బస్సుల్లో ఉండే రద్దీని ఆసరాగా చేసుకుని మహిళా ప్రయాణికుల బ్యాగుల్లో ఉన్న బంగారు ఆభరణాలను చాకచక్యంగా అపహరిస్తున్నట్లు వెల్లడైంది. ఈ తరహా చోరీలకు పాల్పడుతూ పలువురు ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసినట్లు పోలీసులు గుర్తించారు.

అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. కేసును వేగంగా ఛేదించి, చోరీకి గురైన ఆభరణాన్ని పూర్తిగా రికవరీ చేసిన ప్రత్యేక పోలీసు బృందాన్ని జిల్లా పోలీసు అధికారి అభినందించారు.

error: Content is protected !!
Prajaveek Shanam