మంత్రి నారాయణ సమీక్ష.. జూన్ 24లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశం

నెల్లూరు, జూన్ 11: మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ ఏర్పాట్లపై రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, అధికారులతో కలిసి దర్గా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు.
ఈ సందర్భంగా దర్గా ప్రాంగణంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఈ నెల 26వ తేదీ నుంచి ఐదు రోజులపాటు జరగనున్న రొట్టెల పండుగకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు.దర్గా అభివృద్ధి, పండుగ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం, వక్ఫ్ బోర్డు, మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో కలిపి మొత్తం రూ.10 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే టెండర్లు పూర్తయిన పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.గతంలో రొట్టెల పండుగకు వచ్చిన భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, 2014లో నాలుగు లక్షలుగా ఉన్న సంఖ్య 2019 నాటికి 14 లక్షలకు చేరిందన్నారు. ఈ ఏడాది రొట్టెల పండుగను మరింత అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు.
జూన్ 24వ తేదీలోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు గడువు విధించిన మంత్రి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, మొబైల్ టాయిలెట్లు, స్నాన ఘాట్ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మహిళలు, పురుషులకు ప్రత్యేక స్నానాల గదులు, కొళాయిలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.ఈ సమీక్షా సమావేశంలో నగర మేయర్ సుజాత అశోక్, మున్సిపల్ కమిషనర్ నందన్, ఏఎస్పీ దీక్ష, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.













