
కాకినాడ, జూన్ 11: కాకినాడ కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న చోడపురెడ్డి శివకుమార్‌కు సంబంధించిన నివాసాలు, కార్యాలయాలు మరియు బంధువుల ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో చేపట్టిన ఈ దాడుల్లో రూ.8 కోట్లకు పైగా విలువైన ఆస్తులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
సోదాల సందర్భంగా కాకినాడతో పాటు హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రాంతంలో విలాసవంతమైన ఫ్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే రూ.1.20 కోట్ల విలువైన ఖాళీ స్థలం, వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.ఇంకా రూ.1.06 కోట్ల విలువైన సుమారు 700 గ్రాముల బంగారు ఆభరణాలు, భారీ మొత్తంలో నగదు, బ్యాంకు డిపాజిట్లు, పెట్టుబడులకు సంబంధించిన పత్రాలను పరిశీలిస్తున్నారు. అలాగే టయోటా ఫార్చ్యూనర్, మహీంద్రా థార్, ఎలక్ట్రిక్ కారు సహా పలు విలాసవంతమైన వాహనాలను అధికారులు గుర్తించారు.సోదాల్లో ఖరీదైన మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, తొమ్మిది లగ్జరీ వాచీలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నిందితుడి కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లపై ఉన్న ఆస్తులకు సంబంధించిన వివరాలను కూడా ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు.ఆదాయ వనరులు, ఆస్తుల కొనుగోలు వివరాలు, బ్యాంకు లావాదేవీలపై లోతుగా దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న సోదాల్లో మరిన్ని అక్రమాస్తులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సోదాలు ముగిసిన అనంతరం అధికారికంగా వెల్లడించనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.












