
పులివెందుల, జూన్ 11: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా పులివెందులలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ విజయవంతం కావడంలో కృషి చేసిన కార్యకర్తలు, బీజేపీ నాయకులు, జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు.ప్రతిపక్షాలు కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనను “వెన్నుపోటు దినం”గా అభివర్ణించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పెన్షన్ను రూ.2,000 నుంచి రూ.3,000కు పెంచడానికి ఐదేళ్ల సమయం పట్టిందని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.3,000 నుంచి రూ.4,000కు పెంచిందని గుర్తు చేశారు.
‘అమ్మఒడి’ పథకానికి గతంలో పలు పరిమితులు ఉండేవని, ప్రస్తుతం దానిని ‘తల్లికి వందనం’గా రూపాంతరం చేసి ఒకే కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే వారందరికీ ప్రయోజనం కల్పిస్తున్నామని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో పాటు ‘దీపం’ పథకం కింద ఇప్పటికే రెండు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించినట్లు పేర్కొన్నారు.నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంపై పెట్టుబడిదారులకు విశ్వాసం పెరగడంతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. ఎన్నికల హామీల మేరకు ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి అమలు చేస్తామని స్పష్టం చేశారు.
పులివెందుల మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ పట్టణ అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఔటర్ రింగ్ రోడ్డు, బస్టాండ్ ప్రాంత అభివృద్ధి, విగ్రహాల పునర్నిర్మాణం పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేశారని ఆరోపించారు.ఎర్రబల్లి చెరువులో బోటింగ్ ప్రాజెక్టు పేరిట భారీ అవినీతి జరిగిందని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. తాము మాత్రం స్వల్ప నిధులతో చెరువును అభివృద్ధి చేసి ప్రజలకు ఉపయోగపడేలా చేశామని తెలిపారు.చిన్నరంగాపురం, పెద్దరంగాపురం, వెంకటాపురం, ఇడుపులపాయ తదితర గ్రామాల్లో గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పలు అభివృద్ధి పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా ఆ పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
గత రెండేళ్లుగా పులివెందులలో వ్యాపారవేత్తలు, సాధారణ ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నారని, దౌర్జన్యాలు, బెదిరింపులు, ఫ్యాక్షన్ రాజకీయాలకు తావు లేకుండా చట్టవ్యవస్థ పటిష్టంగా అమలవుతోందని చెప్పారు. డీఎస్పీ ఆధ్వర్యంలో శాంతిభద్రతలు సమర్థవంతంగా నిర్వహించబడుతున్నాయని పేర్కొన్నారు.
కేంద్రం, రాష్ట్రంలో ఒకే కూటమి ప్రభుత్వం ఉండటం వల్ల అభివృద్ధి వేగవంతమవుతోందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపిస్తే పులివెందుల అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకువచ్చి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు.ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా బెదిరింపుల రాజకీయాలు జరిగాయని ఆరోపిస్తూ, ఈసారి ప్రజలు కూటమికి మద్దతు ఇవ్వాలని కోరారు.












