
గూడూరు, జూన్ 12: గూడూరు పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ, గూడూరు నియోజకవర్గ ఇన్చార్జి మేరిగ మురళీధర్, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ ర్యాలీలో ఎస్ఈసీ సభ్యులు కొడవలూరు భక్తవత్సల రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు చేవూరు విజయ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ఆరోపించారు. సంక్షేమ పథకాలు, నిరుద్యోగ భృతి, ఉద్యోగ నియామకాలు, ఇంధన ధరలు, సామాజిక వర్గాల సంక్షేమం వంటి అంశాలపై ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేశారు.ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ప్రజా సమస్యలపై పార్టీ తరఫున ఉద్యమాలు కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.













