
.7 లక్షల విలువైన నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం
సూళ్లూరుపేట, జూన్ 12: విలాసాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడిన ఇద్దరు యువకులను సూళ్లూరుపేట పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.7 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, నాయుడుపేట డీఎస్పీ బి. చెంచుబాబు పర్యవేక్షణలో సూళ్లూరుపేట సీఐ ఎం. మురళీకృష్ణ, ఎస్ఐ జి. అజయ్ కుమార్ సిబ్బందితో కలిసి కోటపోలూరు క్రాస్ రోడ్డు వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు.విచారణలో వారు సూళ్లూరుపేట మండలం మన్నెముత్తెరి గ్రామంలోని హోలీ గ్రేస్ షాలోమ్ చర్చి వెనుక ఉన్న పాస్టర్ ఇంటి తలుపులు పగులగొట్టి చోరీ చేసినట్లు అంగీకరించారు. అరెస్టయిన వారిని కొమ్మినేనిపల్లికి చెందిన పాకం మనోజ్ కుమార్ అలియాస్ మను (19), కారుమంచివారి కండ్రిగకు చెందిన తోప్పని ఈశ్వర్ (19)గా గుర్తించారు.వారి వద్ద నుంచి రూ.2 లక్షల నగదు, రూ.5 లక్షల విలువైన బంగారు చైన్లు, బుట్టకమ్మలు, చెంపసరాలు, కమ్మలు, ఉంగరాలు స్వాధీనం చేసుకున్నారు.నేరస్థలంలో దొంగలు వదిలివెళ్లిన చెప్పులను కీలక ఆధారంగా తీసుకుని కేసును ఛేదించినట్లు పోలీసులు తెలిపారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ అజయ్ కుమార్, పోలీసు సిబ్బంది కుప్పారావు, కిషన్, కిరణ్బాబులను డీఎస్పీ చెంచుబాబు అభినందించి రివార్డుల కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు సీఐ వెల్లడించారు.












