కలవకొండ అరుంధతి వాడలో తాగునీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్థుల విజ్ఞప్తి

గూడూరు  జూన్ 15 (ప్రజావీక్షణం)

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలోని అరుంధతి వాడలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు. గ్రామంలో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామంలో రెండు బావులు, ఒక నీటి పాయింట్ ఉన్నాయని, వాటిలో సమృద్ధిగా నీరు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజలకు తాగునీరు సరఫరా చేసే చర్యలు చేపట్టడం లేదని గ్రామస్థులు తెలిపారు. సమస్యను పలుమార్లు గ్రామ సచివాలయ సిబ్బంది, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు.కొంతమంది స్థానిక నాయకులు, అధికారులు తమపై వివక్ష చూపుతున్నారని ఆరోపించిన గ్రామస్థులు, తమ వాడలో అభివృద్ధి పనులు కూడా జరగడం లేదని తెలిపారు. తాగునీటి సమస్య కారణంగా మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.కావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అరుంధతి వాడలో తాగునీటి సరఫరాను పునరుద్ధరించి ప్రజల సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.

error: Content is protected !!
Prajaveek Shanam