ఆటో డ్రైవర్లకు సీఐ శేఖర్‌బాబు హెచ్చరిక

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు – గూడూరు పట్టణంలో రద్దీ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

ప్రజావిక్షణం (గూడూరు) జూన్ 15

గూడూరు పట్టణంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే విధంగా వ్యవహరించే ఆటో డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని టౌన్ సీఐ శేఖర్‌బాబు హెచ్చరించారు. పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహన రద్దీ నేపథ్యంలో ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడం కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లతో నిర్వహించిన సమావేశంలో సీఐ మాట్లాడుతూ, రహదారులపై ఎక్కడపడితే అక్కడ ఆటోలను నిలిపివేయడం, ప్రయాణికుల కోసం రోడ్ల మధ్యలో ఆగడం, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే విధంగా వ్యవహరించడం వంటి చర్యలను సహించబోమన్నారు. ముఖ్యంగా బస్టాండ్, రైల్వే స్టేషన్, ప్రధాన కూడళ్లు, మార్కెట్ ప్రాంతాలు, విద్యాసంస్థల పరిసరాల్లో ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆటోల్లో నిర్ణీత సంఖ్యకు మించి ప్రయాణికులను ఎక్కించరాదని, మైనర్ పిల్లలతో వాహనాలు నడిపించకూడదని, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, బీమా పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించడంతో పాటు అవసరమైతే కేసులు నమోదు చేయనున్నట్లు స్పష్టం చేశారు.పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఆటో డ్రైవర్లు పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆటో స్టాండ్లను మాత్రమే వినియోగించాలని, రహదారులను ఆక్రమించకుండా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగావ్యవహరించినప్పుడే పట్టణంలో రవాణా వ్యవస్థ సజావుగా సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం లో ఎస్ ఐ మనోజ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.నిబంధనలు పాటించే డ్రైవర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, అయితే ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే వారిపై మాత్రం చట్టపరమైన చర్యలు తప్పవని సీఐ శేఖర్‌బాబు మరోసారి హెచ్చరించారు.

error: Content is protected !!
Prajaveek Shanam