
గూడూరు (ప్రజావీక్షణం) జూన్ 15
భవన నిర్మాణ కార్మికులకు చట్టబద్ధంగా అందాల్సిన సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలని కోరుతూ సోమవారం గూడూరులోని లేబర్ కార్యాలయం ఎదుట భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల అమలుపై స్పష్టమైన చర్యలు కనిపించడం లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. కార్మికుల సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డు నిధులు ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేయకుండా ఖజానాలోనే ఉంచారని పేర్కొన్నారు.
ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలు, వికలాంగులుగా మారిన కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. భవన నిర్మాణ కార్మికులకు చట్ట ప్రకారం అందాల్సిన అన్ని సంక్షేమ పథకాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో భవన నిర్మాణ కార్మికులకు వివిధ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, అదనంగా కొత్త పథకాలను కూడా ప్రవేశపెడుతున్నారని పేర్కొన్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కార్మికులకు సమగ్ర సంక్షేమ పథకాలు అందించాలని కోరారు.ప్రమాద మరణాలకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం, అంగవైకల్యానికి రూ.2 లక్షలు, కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్లు, కుమార్తె వివాహానికి ఆర్థిక సాయం, ప్రసూతి ఖర్చులు, సహజ మరణాలకు అంత్యక్రియల ఖర్చులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 60 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ.6 వేల పెన్షన్ అందించాలని కోరారు.అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని లేబర్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ ఈ. లక్ష్మీప్రసన్నకు అందజేశారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ సంఘం గౌరవాధ్యక్షులు పుట్టా శంకరయ్య, కార్యదర్శి ఎస్.డి. రఫీ, కమిటీ సభ్యులు గండికోట మధు, పి. రాజు, బి. లక్ష్మయ్య, డి. సుధాకర్, డి. మునిరెడ్డి, ఎస్.డి. హాసిన్, పి. శ్రీనివాసులు, నాయకులు జోగి శివకుమార్, బి.వి. రమణయ్య, ఎంబేటి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.













