పేదల పక్షాన నిరంతరం పోరాడుతున్న ఏసుపాక పెంచలయ్య, రావూరు సురేంద్ర

గాంధీనగర్ అర్హులకు వెంటనే ఇంటి స్థలాలు కేటాయించాలి – ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించిన  నాయకులు

గూడూరు, జూన్ 16 (ప్రజా వీక్షణం): గూడూరు ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పేద కుటుంబాలకు ఇంటి నివేశ స్థలాలు అందించాలనే లక్ష్యంతో జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు ఏసుపాక పెంచలయ్య, డివిజన్ అట్రాసిటీ కమిటీ సభ్యులు రావూరు సురేంద్ర నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. పేదలకు న్యాయం జరగాలనే సంకల్పంతో వారు అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్తూ ప్రజల తరఫున గళం విప్పుతున్నారు.ఈ క్రమంలో గాంధీనగర్‌లోని అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకు ఇంటి నివేశ స్థలాలు పంపిణీ చేయాలని ఏసుపాక పెంచలయ్య, రావూరు సురేంద్ర, శ్రీపాదం ఉదయ్ కుమార్, అంకిరెడ్డి రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 50 మంది గిరిజనులు ఎమ్మార్వోను కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గూడూరు అర్బన్ పరిధిలోని గాంధీనగర్‌లో ప్రభుత్వ ఖాళీ స్థలాలు గతంలో ఆక్రమణలకు గురయ్యాయని, వాటిని తొలగించి అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకు ఇంటి స్థలాలు మంజూరు చేసి కాలనీ గృహాలు నిర్మించాలని పలుమార్లు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్‌కు ప్రజాదర్బార్‌లో వినతులు అందజేసినట్లు తెలిపారు.ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఆక్రమణలను తొలగించినప్పటికీ ఇప్పటివరకు అర్హులైన కుటుంబాలకు పొజిషన్ పట్టాలు మంజూరు చేయడం గానీ, స్థలాలు అప్పగించడం గానీ జరగలేదని పేర్కొన్నారు. ప్రశాంత్‌నగర్ సమీపంలో గుర్తించిన స్థలాల్లో 50 గిరిజన కుటుంబాలకు స్థలాలు కేటాయిస్తామని తెలిపి దాదాపు రెండు సంవత్సరాలు గడిచినా ఎలాంటి పురోగతి లేదన్నారు.రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం కారణంగా ఖాళీ స్థలాలు మళ్లీ ఆక్రమణలకు గురయ్యే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సూచించిన విధంగా అర్హులైన లబ్ధిదారులకు వెంటనే పొజిషన్ పట్టాలు మంజూరు చేసి స్థలాలు అప్పగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా స్థాయి అధికారులను కలిసి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.పేదల సంక్షేమమే ధ్యేయంగా గిరిజనులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏసుపాక పెంచలయ్య, రావూరు సురేంద్ర సేవలను స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు. సామాజిక న్యాయం సాధనలో వారి పాత్ర ఆదర్శప్రాయమని, పేదల సమస్యల పరిష్కారానికి వారు ఎల్లప్పుడూ ముందుంటారని పలువురు కొనియాడుతున్నారు. ఈ కార్యక్రమంలో చల్లా శ్రీ వర్ధన్ రెడ్డి, షేక్ జై నుద్దీన్, సలీం ,వినయ్, తోకలపూడి రమేష్, వెంకయ్య, 50 మంది గిరిజన మహిళలు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam