
గూడూరు పట్టణంలోని గంగమ్మగుడి వీధిలో గల మ్యాట్రిక్స్ టైలర్స్ గంగమ్మగుడి శాఖ (ఏఐటీయూసీ అనుబంధం) సమావేశం గురువారం కామ్రేడ్ పెంచలయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో కార్మికుల హక్కుల పరిరక్షణ, సంఘం బలోపేతం, కార్మిక సంక్షేమ కార్యక్రమాలు, సభ్యత్వ విస్తరణ తదితర అంశాలపై చర్చించారు.అనంతరం నూతన శాఖ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శాఖ అధ్యక్షులుగా వీరేపల్లి శంకర్, కార్యదర్శిగా బల్లి పెంచలయ్య, కోశాధికారిగా వేమయ్య ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కొమ్మి నారాయణ, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి జి. శశికుమార్, సీపీఐ గూడూరు పట్టణ కన్వీనర్ యాదాల సునీల్ మాట్లాడుతూ భారత కార్మిక ఉద్యమ చరిత్రలో ఏఐటీయూసీ కీలక పాత్ర పోషించిందన్నారు. 1920లో స్థాపించబడిన ఏఐటీయూసీ దేశంలోని తొలి జాతీయ కార్మిక సంఘంగా కార్మికుల హక్కులు, సంక్షేమం, సామాజిక భద్రత కోసం నిరంతరం పోరాటం చేస్తోందని పేర్కొన్నారు.కార్మిక వర్గ ప్రయోజనాల సాధనలో సీపీఐ, ఏఐటీయూసీలు చారిత్రాత్మక పాత్ర పోషించాయని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్మికులు ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధన కోసం సంఘటిత పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.












