
జూన్ 20 “రెవెన్యూ డే” పురస్కరించుకుని గూడూరు తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విధి నిర్వహణలో విశేష సేవలందించి పదవీ విరమణ పొందిన రెవెన్యూ సిబ్బందిని ఘనంగా సన్మానించి గౌరవించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రజల జీవితాల్లో రెవెన్యూ శాఖ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఒక వ్యక్తి జననం నుంచి మరణం వరకు అవసరమయ్యే ధృవపత్రాల జారీ, ఆధార్ సంబంధిత సేవలు, భూముల రికార్డుల నిర్వహణ, భూదార్ సంఖ్యల కేటాయింపు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన భూముల గుర్తింపు, సేకరణ, కేటాయింపు వంటి అనేక బాధ్యతలను రెవెన్యూ శాఖ సమర్థవంతంగా నిర్వహిస్తోందని వివరించారు.ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులకు సహాయక చర్యలు అందించడంలోనూ, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవడంలోనూ రెవెన్యూ యంత్రాంగం ముందుంటుందని పేర్కొన్నారు. ప్రజలకు నిత్యం అనేక సేవలు అందిస్తున్న రెవెన్యూ శాఖ సేవలను గుర్తించి ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించడం గర్వకారణమని తెలిపారు.కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులను శాలువాలతో సత్కరించి, వారి సేవలను కొనియాడారు. అనంతరం వారికి జ్ఞాపికలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో
రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు పాల్గొన్నారు.















