కార్మికుల హక్కుల కోసం గూడూరులో నిరసన

గూడూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా

(గూడూరు) జూన్ 20

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర సమితి పిలుపు మేరకు మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం గూడూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కే. నారాయణ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పారిశుధ్య కార్మికుల కొరత తీవ్రంగా ఉందన్నారు. పారిశుధ్య, ఇంజనీరింగ్ విభాగ సేవలను థర్డ్ పార్టీ కాంట్రాక్టర్లకు అప్పగించే విధానాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. కోర్టు తీర్పు మేరకు ఒప్పంద, పొరుగు సేవల కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు బీ. గోపి మాట్లాడుతూ గూడూరు మున్సిపాలిటీలో కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మున్సిపల్ కార్మికులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు కేటాయించాలని, 1953 నుంచి అమలులో ఉన్న ఆనవాయితీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన, పదవీ విరమణ పొందిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, సంక్షేమ పథకాలను అందరికీ వర్తింపజేయాలని కోరారు. పెరుగుతున్న జనాభా, విస్తీర్ణానికి అనుగుణంగా అదనపు సిబ్బందిని నియమించాలని, గ్రాట్యుటీ చట్టం ప్రకారం కార్మికులందరికీ గ్రాట్యుటీ అమలు చేయాలని అన్నారు.పీఆర్సీని నియమించి 30 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని, పర్మినెంట్ కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం కోర్టు తీర్పుల మేరకు అమలు చేయాలని, జీవో ఎంఎస్-25 ప్రకారం మరణించిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. స్వీపింగ్ మిషన్ల వల్ల పనులు సమర్థవంతంగా జరగడం లేదని, అధిక వ్యయం చేసినా ఫలితం కనిపించడం లేదని విమర్శించారు. ఆ నిధులతో అదనపు కార్మికులను నియమించి పారిశుధ్య పనులు నిర్వహించాలని సూచించారు.ధర్నా సందర్భంగా కార్మికులు “సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి”, “కార్మికుల సమస్యలు పరిష్కరించాలి” అంటూ నినాదాలు చేశారు. అనంతరం మున్సిపల్ మేనేజర్ సోమశేఖర్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి జీ. శశికుమార్, సహాయ కార్యదర్శి షేక్ జమాలుల్లా, పట్టణ కన్వీనర్ సునీల్ యాదాల, మున్సిపల్ కార్మిక సంఘం కార్యదర్శి రాఘవయ్య, నాయకులు సంపూర్ణమ్మ, ప్రభావతి, వెంకటకృష్ణ, ప్రసాద్, శ్రీలక్ష్మి, ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి పీ. యశ్వంత్, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam