కోడలిని కాపాడబోయి విద్యుత్ షాక్‌తో గిరిజన దంపతుల మృతి


సైదాపురం, జూన్ 20: నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని చాగణం రాజుపాళెం ఎగువ సంఘం గిరిజన కాలనీలో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. కోడలిని విద్యుత్ షాక్ నుంచి కాపాడేందుకు ప్రయత్నించిన అత్తామామలు ప్రాణాలు కోల్పోయారు.స్థానికుల కథనం మేరకు, చెంచమ్మ అనే మహిళ ఇంటి వద్ద తీగపై బట్టలు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌కు గురైంది. ఆమెను రక్షించేందుకు అత్త ఇండ్ల సునీత (52), మామ ఇండ్ల రవి (57) వెంటనే ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో వారిద్దరూ కూడా విద్యుత్ ఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డారు.
ఘటనను గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టినా సునీత, రవి అక్కడికక్కడే మృతి చెందారు. చెంచమ్మ తీవ్ర గాయాలతో బయటపడగా, 108 అంబులెన్స్ ద్వారా సైదాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోడలిని కాపాడే ప్రయత్నంలో అత్తామామలు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

error: Content is protected !!
Prajaveek Shanam