
గూడూరు: గూడూరు రెండో పట్టణ పరిధిలోని జి.ఎస్. రాయులు సెంటర్ సమీపంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల (సీతమ్మ బడి)లో శుక్రవారం మెగా పేరెంట్స్ డే–4.0 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఎం.డి. అబ్దుల్ రహీమ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కాంతమ్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ రహీమ్ మాట్లాడుతూ విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ‘తల్లికి వందనం’ పథకం కింద ప్రతి అర్హ విద్యార్థికి రూ.13 వేల ఆర్థిక సహాయం అందించడంతో పాటు పౌష్టికాహారం, యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు వంటి సౌకర్యాలను కల్పిస్తోందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని, పేదరికాన్ని అధిగమించడానికి విద్యే శాశ్వత మార్గమని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’తో పాటు ఇతర సూపర్ సిక్స్ పథకాల ద్వారా కుటుంబాలు పొందుతున్న ప్రయోజనాలపై తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు కాంతమ్మ, మాజీ కౌన్సిలర్ తాళ్ల సుబ్బమ్మ, టీడీపీ నాయకులు కేశవర్ధన్, శంకర్ నాయుడు, ఉమామహేశ్వరరావు, అబ్దుల్ రబ్, షణ్ముగం, కిషోర్, విద్యా కమిటీ చైర్మన్ గౌరీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.












